PV Ramesh Resigns Megha Engineering: 'మనస్సాక్షికి విరుద్ధంగా నన్ను ప్రభావితం చేయలేరు..' మేఘా సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా - స్కిల్ డెవలప్‌మెంట్ కేసు
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 3:37 PM IST
PV Ramesh Resigns Megha Engineering : మేఘా ఇంజినీరింగ్ సంస్థకు విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరుపై రమేశ్ అనుమానాలు వ్యక్తం చేయడం విదితమే. తనను రాజీనామా చేయాలని మేఘా సంస్థ కోరలేదని రమేశ్ వెల్లడించారు.
మనస్సాక్షిగా పనిచేశా.. యావత్ జీవితం నిరంతరాయంగా, నిస్సందేహంగా ప్రజా ప్రయోజనాల కోసమే పని చేశానని పీవీ రమేశ్ స్పష్టం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యాపార ఒత్తిళ్లకు అతీతంగా వ్యవహరించానని ట్వీట్ చేశారు. మనస్సాక్షికి విరుద్ధంగా పని చేయాలని... ఏ ఒక్కరూ, ఆఖరికి దేవుడు కూడా తనను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు.
ఫైల్ లేకుండా కేసు ఎలా.. చంద్రబాబు నాయుడు హయాంలో పీవీ రమేశ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేశారు. యువతకు మేలు చేసేందుకే నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటైందని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో చట్టపరమైన విధానాలు పాటించారని.. చట్టసభ, కేబినెట్, అనుమతితోనే వనరులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. అన్నీ ఫైనల్ అయ్యాకే.. నిర్ణయం తీసుకున్న నాటి సీఎం చంద్రబాబు (Chandrababu) మీద కేసు పెట్టడం దారుణమని రమేశ్ పేర్కొన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవమని చెప్తూ.. పోయిన నోట్ ఫైల్స్ మీద సీఐడీ (CID) దృష్టి పెట్టాలని హితవు పలికారు. సీఎంగా ఉండేవారు అనేక అంశాలను పర్యవేక్షిస్తారని, వాటికి సంబంధించిన శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలని రమేశ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Skill Development Corporation) ఫైల్స్ పరిశీలిస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయని చెప్పారు. తన వాంగ్మూలం ఆధారంగానే మాజీ సీఎంను అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమంటూ.. తీవ్రంగా ఖండించారు.