పబ్లిక్ టాయిలెట్లో కిచెన్.. రోజూ అక్కడే వంట.. ఎందుకో తెలుసా? - టాయిలెట్ కిచెన్ సూరత్
🎬 Watch Now: Feature Video
పబ్లిక్ టాయిలెట్లో వంట చేసుకుంటూ స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ వ్యక్తి. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. పార్లే పాయింట్ బ్రిడ్జి కింద కోట్ల రూపాయలతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ టాయిలెట్ నిర్మించింది. ఇందులోని దివ్యాంగుల టాయిలెట్లో రఘువీర్ సింగ్ అనే వ్యక్తి కిచెన్ ఏర్పాటు చేసుకున్నాడు. టాయిలెట్ ఉపయోగించుకునేందుకని ఓ స్థానికుడు అటువైపు వెళ్లగా.. ఈ విషయం బయటపడింది. ఇక్కడ వంట ఎందుకు చేసుకుంటున్నావని స్థానిక వ్యక్తి ఆరా తీయగా.. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు రఘువీర్. వంట చేసుకునేందుకు తనకు ఎక్కడా స్థలం దొరకలేదని, అందుకే టాయిలెట్లో కిచెన్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. టాయిలెట్లు చూసుకునే పని తనదేనని తెలిపాడు. ఇతర టాయిలెట్లలో వేరే వ్యక్తులు అసాంఘిక పనులు కూడా చేస్తున్నారని దబాయించాడు. 'రాత్రి 10 తర్వాత టాయిలెట్లను మూసేస్తారు. నేను రెండ్రోజుల క్రితమే ఇక్కడికి వచ్చా. రాత్రి పూట ఇక్కడే వండుకుంటున్నా. ఇతర తప్పుడు పనులు చేయడం లేదు. బయట వేరే టాయిలెట్లలో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు' అని రఘువీర్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పరేశ్ పటేల్ వెల్లడించారు.