మహిళా న్యాయమూర్తి భరతనాట్యం- చప్పట్లతో మార్మోగిన ఆడిటోరియం - భరతనాట్యం చేసిన సునీతా విమల్
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 7:28 PM IST
Kerala Judge Bharatanatyam Performance In Stage : స్టేజ్‌పై భరతనాట్యం చేసి ఔరా అనిపించారు ఓ మహిళా జడ్జి. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న కేరళీయం వేడుకలో భాగంగా ఆమె తిరువనంతపురంలోని నిశాగంధి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన చేశారు. ఆమె ప్రదర్శనకు ప్రేక్షకులు, రాజకీయ నాయకులు ముగ్ధులయ్యారు. చప్పట్లతో ఆడిటోరియాన్ని మార్మోగించారు.
కొల్లాం ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ ఈఎస్ఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా విమల్.. కేరళీయం వేడుకల్లో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లయకు తగ్గట్లు భరతనాట్యం చేసి ఆకట్టుకున్నారు. అయితే సునీత.. జడ్జి అని వీక్షకులకు చాలా మందికి తెలియదు. ఆమె నాట్యాన్ని చూసి జడ్జి అని తెలిశాక ఆశ్చర్యపడ్డారు. కేరళీయం వేడుకల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తదితరులు నేరుగా వేదిక వద్దకు వెళ్లి జస్టిస్ సునీతా విమల్‌ను అభినందించారు.
తాను మహిళా న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించినా భరతనాట్యాన్ని మర్చిపోలేదని కార్యక్రమం అనంతరం జస్టిస్ సునీతా విమల్ తెలిపారు. ఉదయం 4:30 గంటలకు లేచి 6 గంటల వరకు భరతనాట్యాన్ని సాధన చేస్తానని చెప్పారు. డ్యాన్స్ ఇష్టమా? లేక న్యాయమూర్తి వృత్తి ఇష్టమా? అని విలేకరులు న్యాయమూర్తిని అడడగా.. తన మొదటి ప్రాధాన్యం జడ్జి వృత్తికేనని ఆమె తెలిపారు. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయగలనని ఆమె చెప్పారు.
జస్టిస్ సునీత తన పాఠశాల రోజుల నుంచి భరతనాట్యం, మోహినిఅట్టం నేర్చుకున్నారు. జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా భరతనాట్యం సాధన చేస్తుండేవారు. ఇప్పటివరకు చాలా దేవాలయాల్లో ఆమె భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు.