Fire breaks out from borewell: కోనసీమ పంట పొలాల్లో గ్యాస్ లీక్ మంటలు.. అదుపు చేసిన అధికారులు
🎬 Watch Now: Feature Video
Fire breaks out from borewell due to gas leak in Konaseema: కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో ఆక్వా చెరువు బోరు నుంచి అగ్నికీలలు ఎగిసిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇరవై అడుగులు మేర మంటలు, 40 అడుగుల మేర నీరు ఎగిసిపడ్డాయి. ఆక్వారైతు జగదీష్‌కు చెందిన చెరువులోని బోరు నుంచి ఉదయం గ్యాస్ మంటలు రాగా.. స్థానిక ఆక్వా రైతులు ఆందోళన చెందారు. ఓఎన్జీసీ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు చేసినా ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.
మంటలు వచ్చిన బోరు ఐదేళ్ల నుంచి వినియోగంలో ఉంది. మరింత లోతుగా బోరు తవ్వినపుడు.. అడుగున ఉన్న గ్యాస్ పైపులకు తగిలి గ్యాస్ లీకైందని స్థానికులు అంటున్నారు. అయితే.. కింద ఎలాంటి పైపు లైన్లు లేవని ఓఎన్జీసీ వర్గాలు చెప్పాయి. భూమి పొరల్లో ఉన్న గ్యాస్ ఒక్కసారి పైకి చొచ్చుకు రావడం వల్లే.. మంటలు అంటుకున్నాయని ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్ల క్రితం వేసిన ఈ బోరు నుంచి గత రెండు రోజులుగా ఆక్వా చెరువులకు నిరంతరాయంగా నీరు తోడుతున్నారని స్థానికులు తెలిపారు. సహజవాయువు, నీరు, మంటలతో పరిసర ప్రాంతం బురదమయంగా మారింది. తాజా ఘటనతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళన చెందారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తెలుగుదేశం సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.