అతీక్ అహ్మద్ హత్య క్రైమ్ సీన్ రీక్రియేషన్.. కీలక విషయాలు వెల్లడి!
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ప్రయాగ్‌రాజ్‌లో భారీ భద్రత మధ్య క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసింది సిట్ బృందం. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ పభుత్వం ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిటీ కూడా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించింది.
ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. హత్యకు ముందు రోజు నిందితులు జర్నలిస్టుల లాగా ట్రైనింగ్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. హంతకులకు సహకరించిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అతీక్‌ను ఏప్రిల్ 14న ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరు పరిచేటప్పుడే చంపాలనుకున్నారు నిందితులు. కానీ కోర్టు వద్ద భారీ భద్రత ఉండటం వల్ల ప్లాన్ వాయిదా వేశారు. ఆ తర్వాత ఆస్పత్రి వద్ద భద్రత తక్కువగా ఉండటం వల్ల.. హత్య చేయడానికి వీలు కలిగింది. అయితే, హత్యకు ముందు రోజు నిందితులు ఘటనా స్థలానికి 1.5 కిలో మీటర్ల దూరం ఉన్న హోటల్లో బస చేసి.. రెక్కీ నిర్వహించారు. అతీక్ హత్య తర్వాత పరారైన అతడి భార్య షైష్తా పర్వీన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం కౌశంబీ జిల్లాలో ఆమె కోసం పలు చోట్ల దాడులు నిర్వహించారు.
అయితే, 2005లో హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ మర్డర్ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు లాయర్ ఉమేశ్ పాల్. అతడు కూడా ఫిభ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్ పాల్‌తో పాటు అతడి బాడీగార్డ్స్ ఇద్దర్ని హత్య చేశారు. ఈ కేసులో అతీక్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న అతిక్ కుమారుడు అసద్, అనుచరుడు గులామ్‌ను ఏప్రిల్ 13న టాక్స్‌ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వార జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు నిందితులు ఏప్రిల్ 15న అతిక్, అష్రఫ్‌ను దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.