భార్యనే రెండోసారి పెళ్లి చేసుకున్న నటుడు.. పిల్లల ఆస్తి కోసం 28 ఏళ్ల తర్వాత..
🎬 Watch Now: Feature Video
కేరళకు చెందిన ప్రముఖ నటుడు, న్యాయవాది షుక్కూర్ తన భార్యను తానే రెండోసారి వివాహం చేసుకున్నారు. పెళ్లైన 28 ఏళ్ల తర్వాత అధికారికంగా రిజిస్టర్ ఆఫీస్లో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన ముగ్గురు కుమార్తెల సాక్షిగా తన భార్యను మనువాడారు షుక్కూర్. తన ముగ్గురు కుమార్తెలకు ఆర్ధిక భరోసాను కల్పించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బంధువులు, సహోద్యోగుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే వీరు తమ కుమార్తెల కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం విశేషం. తమ తల్లిదండ్రులను చూసి తామ గర్వపడున్నామని షుక్కూర్ కుమార్తెలు తెలిపారు. కాసర్గోడ్లోని కన్హంగాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వీరి వివాహానికి వేదికైంది. 28 సంవత్సరాల తర్వాత మళ్లీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తన భార్య షీనానే.. షుక్కూర్ వివాహం చేసుకున్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తన మరణానంతరం ముగ్గురు కుమార్తెలకు తన ఆస్తి లభించదని.. తన సోదరులకు చెందుతుందని అందుకే తన భార్యను రెండోసారి పెళ్లి చేసుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా షుక్కూర్ తెలిపారు. 1994 అక్టోబర్ 6న షుక్కూర్, షీనా దంపతులకు పాలక్కాడ్లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే ఇందంతా ఓ నాటకమే అని షుక్కూర్ సోదరులు అంటున్నారు.