ఎత్తు 3 అడుగులు.. వ్యాపారంలో అదుర్స్.. ఎందరికో ఆదర్శంగా మరుగుజ్జు! - dwarf woman giving jobs to women in nashik
🎬 Watch Now: Feature Video
వైకల్యాన్ని జయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మూడు అడుగుల మహిళ. మరుగుజ్జు కావడం వల్ల చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టింది. తన పరిశ్రమలో మహిళలకు ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఆమెనే నాశిక్‌కు చెందిన పుజ ఘోడ్కే.
పూజ ఘోడ్కే ఓ మరుగుజ్జు. ఈమె ఎత్తు మూడు అడుగులు. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంది. అందరూ ఆమెను ఆటపట్టించేవారు. అలా ఎవరూ అనకూడదని పూజను అమ్మాయిల కాలేజీలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. కానీ అక్కడ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలా ఇబ్బందులు పడుతూనే ఎం.కామ్ పూర్తి చేసిన పూజ.. ఉద్యోగాల వేటలో పడింది. బ్యాంక్ పరీక్ష రాసి.. అందులో ఫెయిల్ అయింది. దీంతో ఆలోచనలో పడ్డ పూజ.. తన తండ్రికి ఉన్న చిన్న అప్పడాల వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని.. పెద్ద మెషీన్లు తెచ్చి.. వ్యాపారం ప్రారంభించింది. ఉపాధి దొరకక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన పుజ 'నా వల్ల కొందరు మహిళలకు ఉపాధి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెబుతోంది.
'తక్కువ ఎత్తు ఉన్నందుకు నేనేమీ బాధపడటం లేదు. చాలా మంది వికలాంగులు, అంధులు, ఇంకొంతమంది బెడ్‌పై, మరికొందరు వీల్ చైర్లో ఉన్నారు. అలాంటప్పుడు వాంరందరిలోకెల్లా నేను అదృష్టవంతురాలినని భావిస్తాను. నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు అందరూ ఆనందంగా జీవించాలి. కానీ కొంత మంది యువత చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి ఘటనలు చూస్తే బాధగా ఉంటుంది. 20-30 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులకు ఇబ్బంది కలించవద్దు' అని పూజ చెప్పుకొచ్చింది.
పూజ విజయంపై ఆమె తల్లి స్పందిస్తూ.. 'పూజ ఎత్తు పెరగదని డాక్టర్ చెప్పినప్పుడు ఆందోళన కలిగింది. ఆమె చిన్నప్పుడు బస్సు ఎక్కలేకపోయింది. దీంతో ఆమె చదువు ఎలా అని భయం వేసింది. కానీ, ఆమె ఎం.కామ్ పూర్తి చేసి.. తన పట్టుదలతో పాపడ్ వ్యాపారం ప్రారంభించింది. ఈ వ్యాపారంలో తనకు మేము కూడా సహాయంగా ఉంటున్నాం. పూజ నా కుమార్తె కాదు.. కుమారుడు' అని చెప్పింది.