తల్లి కష్టం చూడలేక బావి తవ్విన బాలుడు - ప్రణవ్ సల్కార్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
తల్లి.. నీళ్ల కోసం ఇబ్బంది పడటం చూడలేకపోయాడు ఓ పద్నాలుగేళ్ల బాలుడు. మండుటెండలో కాళ్లు కాలుతున్నా.. తన తల్లి చాలా దూరం నీటి కోసం వెళ్లడం చూసి ఆ బాలుడి గుండె ద్రవించుకుపోయింది. దీంతో తన ఇంటి ముందు తానే ఓ బావిని నిర్మించాలని తలచాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లోని పనిముట్లతో బావిని తవ్వి.. తల్లి కష్టాలు తీర్చాడు.
మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన ప్రణవ్ సల్కార్ వయసు కేవలం 14 ఏళ్లే. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పాల్ఘర్ జిల్లాలోని మారుమూల దవంగేపద గ్రామంలో బాలుడి కుటుంబం నివసిస్తోంది. ఆ ప్రాంతంలో నీటి వసతులు అంతంత మాత్రమే ఉండడం వల్ల తన తల్లి దర్శన ప్రతి రోజు నీటి కోసం చాలా దూరంలో ఉన్న నది దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు కావడం వల్ల అప్పుడప్పుడు పనులకు వెళ్లడం కూడా ఆలస్యం అయ్యేది. నీటి కోసం తల్లి పడే పాట్లను చూసిన ప్రణవ్‌కు ఏదో ఒకటి చేయాలనిపించింది. తన తండ్రికి చెప్పి తానే ఓ బావిని తవ్వుతానన్నాడు. ఇంట్లో ఉండే పలుగు పారలతో పని ప్రారంభించాడు.
ప్రణవ్ కష్టాన్ని చూడలేక తండ్రి వినయ్ సల్కర్ కూడా అతడికి సాయం అందించాడు. దీంతో బావి నిర్మాణం అనతి కాలంలోనే పూర్తయింది. 20 అడుగుల లోతు తవ్వగానే నీళ్లు కూడా పడ్డాయి. దీంతో ఆ తల్లి కష్టాలు తీరాయి. సకాలంలో బాలుడి తల్లిదండ్రులు పనులకు వెళ్లగలుగుతున్నారు. బాలుడి సాహసం చూసి గ్రామపంచాయతీ వారు కూడా కదలి వచ్చారు. బావికి ప్రహరీతో పాటు ఓ నల్లా కనెక్షన్‌ను ఏర్పాటు చేశారు.