'దక్షిణాది క్రికెటర్లూ వివక్షను ఎదుర్కొన్నారు' - జాతివివక్షపై ఇర్ఫాన్ పఠాన్ స్పందన
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామికి ఎదురైన జాతి వివక్ష అనుభవం సంగతి తనకు తెలియదన్నాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. దక్షిణాది క్రికెటర్లు ఉత్తర, పశ్చిమ భారతంలో ఆడేటప్పుడు ఈ వివక్షను ఎదుర్కొంటారని వెల్లడించాడు.
!['దక్షిణాది క్రికెటర్లూ వివక్షను ఎదుర్కొన్నారు' irfhan patan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7536802-thumbnail-3x2-rk.jpg?imwidth=3840)
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు తాను జాతి వివక్షను ఎదుర్కొన్నానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తనతో పాటు పెరీరా రంగుపై కొందరు వ్యాఖ్యలు చేశారని సామి చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో సామి మాజీ సహచరుడు ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అతడికి ఇలాంటి అనుభవం ఎదురైందని తమకు తెలియదన్నాడు.
"2014లో నేను సామితో కలిసి ఆడా. అలా నిజంగా జరిగి ఉంటే.. కచ్చితంగా దాని గురించి చర్చ జరిగి ఉండేది. దేశవాళీ క్రికెట్లో కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం నేను చూశా. ముఖ్యంగా దక్షిణాది క్రికెటర్లు ఉత్తర, పశ్చిమ భారతంలో ఆడేటప్పుడు ఈ వివక్షను ఎదుర్కొన్నారు. ప్రేక్షకుల్లో కొందరు సరదా కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. దానర్థం వాళ్లు జాత్యహంకారులని కాదు. తమాషా చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటుతారు"
- ఇర్ఫాన్ పఠాన్, భారత మాజీ ఆల్‌రౌండర్.
ఇది చూడండి : 'ఐపీఎల్‌లో నాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు'