ఉత్తరకొరియా 2017లో నిర్వహించిన అణుపరీక్ష వల్ల భూమి కొన్ని మీటర్ల మేర పక్కకు జరిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. 1945లో జపాన్ నగరమైన హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కన్నా ఇది 17 రెట్లు శక్తిమంతమైందని అంచనా వేసింది.
ఉత్తర కొరియా 2017 సెప్టెంబర్ 3న థర్మోన్యూక్లియర్ లేదా హైడ్రోజన్ బాంబులతో 5 భూగర్భ అణు పరీక్షలు నిర్వహించింది. వీటి తీవ్రతపై గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఇస్రో కేంద్రానికి చెందిన కేఎం శ్రీజిత్ నేతృత్వంలోని బృందం పరిశోధనలు జరిపింది.
ఇలా గుర్తించారు..
ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, జియో సైన్సెస్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు రితేశ్ అగర్వాల్, ఏఎస్ రాజవత్ ఉపగ్రహ సమాచారాన్ని విశ్లేషించి అణుపరీక్షల వల్ల భూమిలో వచ్చిన మార్పులను గుర్తించారు.
'జియోఫిజికల్ జర్నల్ ఇంటర్నేషనల్'లో ప్రచురించిన ఈ అధ్యయనంలో.. భూకంపాలను గుర్తించడానికి వినియోగించే నెట్‌వర్క్‌ల ద్వారా అణు పరీక్షల తీవ్రతను కూడా గుర్తించవచ్చని పేర్కొన్నారు. అయితే ఉత్తరకొరియా అణుపరీక్షలు చేపట్టిన స్థలాన్ని, పేలుడు తీవ్రతను గుర్తించడానికి తగినంత భూకంప తరంగాల సమాచారం (డేటా) అందుబాటులో లేదని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు.
అంతరిక్షం దారిచూపిస్తుందా?
అణుపరీక్షల తీవ్రతను తెలుసుకోవడానికి అంతరిక్షం మార్గం చూపిస్తుందని ఇస్రోకు చెందిన శ్రీజిత్ బృందం నమ్ముతోంది.
జపనీస్ ఏఎల్ఓఎస్-2 ఉపగ్రహం డేటా, ఇన్సార్ సాంకేతికతను ఉపయోగించి.. ఉత్తరకొరియా ఈశాన్య ప్రాంతంలోని మాంటాప్ పర్వత ప్రాంతంలో జరిపిన అణుపరీక్ష తీవ్రతను లెక్కగట్టారు. పేలుడు తీవ్రత వల్ల భూమిలో వచ్చిన మార్పునూ గుర్తించారు.
ప్రస్తుతం పనిచేస్తున్న సెంటినెల-1, అలోస్-2తో పాటు 2022లో ప్రయోగించే నాసా- ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్) మిషన్ సాయంతోనూ అణుపరీక్షల తీవ్రతను గుర్తించవచ్చని ఇస్రో శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.
ఇదీ చూడండి: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు- వారాంతంలోనూ లాభాలు