50 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదిక మీద.. ఓ ఆదివాసీ నటికి జరిగిన అవమానానికి అకాడమీ తాజాగా క్షమాపణలు చెప్పింది. నాడు అలా జరిగి ఉండకూడని ఆస్కార్ అకాడమీ క్షమాపణ లేఖలో తెలిపింది. ఓ ఆదివాసీ నటిగా వేదికపై మీరు ఎదుర్కొన్న వేధింపులు.. సమర్థనీయం కాదని అందులో పేర్కొంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 1973 లో ఆస్కార్ అవార్డుల ప్రదనోత్సవం అట్టహాసంగా జరిగింది. పురస్కారాలు పొందిన నటులు.. కరతాల ధ్వనుల మధ్య అవార్డులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో 'గాడ్‌ఫాదర్' చిత్రానికి నటుడు మార్లోన్ బ్రాండోకు ఆస్కార్.. పురస్కారాన్ని ప్రకటించింది. ఆ అవార్డును తీసుకోవడానికి అతడి తరఫున ఆదివాసి నటి సషీన్ లిటిల్ ఫెదర్ వేదికపైకి వచ్చారు. కానీ తీసుకోవడానికి నిరాకరించారు. మార్లోన్ బ్రాండో ఓ సందేశం పంపారని, పురస్కారాన్ని తిరస్కరించారని తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. "మార్లోన్ బ్రాండో తరపున నేను ఇక్కడకు వచ్చాను. ఆయన మీ కోసం ఒక సుదీర్ఘమైన సందేశం పంపారు. కానీ సమయం లేకపోవడం వల్ల అదంతా ఇప్పుడు చదవలేను. ఈ అవార్డును తిరస్కరిస్తున్నందుకు బ్రాండో చింతిస్తున్నారు. అయితే హాలీవుడ్ సినిమాల్లో అమెరికా ఆదివాసీలను చిత్రీకరిస్తున్న తీరుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు" అని ఆమె వేదికపై అన్నారు.
అయితే సషీన్ ప్రసంగిస్తుండగా వేదిక కింద ఉన్నవారు ఆమెను గేలి చేయడం ప్రారంభించారు. అప్పుడు అక్కడే ఉన్న హాలీవుడ్ నటుడు జాన్ వేని.. నషిన్ చర్యకు కోపంతో రగిలిపోయాడు. స్టేజ్‌పై నుంచి ఆమెను తోసేయడానికి ప్రయత్నించాడు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ అతడి ఆపి.. ఆమెను సురక్షితంగా కార్యక్రమం నుంచి బయటకు తీసుకెళ్లారు.
అయితే ఈ ఘటన జరిగిన అర్ధశతాబ్దం తర్వాత క్షమాపణలు చెబుతూ ఆస్కార్ కమిటీ తాజాగా ఆమెకు లేఖ రాసింది. "నాడు మీరు ఎదుర్కొన్న వేధింపులు.. సమర్థనీయం కాదు. మీకు కలిగిన మానసిక వేదన, కెరీర్‌కు కలిగిన నష్టం పూడ్చలేనిది. మీకు జరిగిన నష్టానికి క్షమాపణలు చెబుతూ.. మీ ధైర్యానికి అభినందిస్తున్నాం" అని నాటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్.. నషీన్కు లేఖ రాశారు. నాడు జరిగిన ఆ తప్పును దిద్దుకునే క్రమంలో భాగంగా సెప్టెంబరులో సషీన్ లిటిల్‌ఫెదర్ కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆటోరిక్షాలో విజయ్‌దేవరకొండ, నడుము నొప్పితో బాధపడుతూ