IS Curd Reduce Colon Cancer Risk: భోజనంలో ఎన్ని రకాలు ఉన్నా చివరికి కొద్దిగా పెరుగుతో తింటేనే తృప్తిగా ఫీలవుతారు చాలా మంది. కానీ, కొందరు అసలు పెరుగును ముట్టుకోరు. అయితే, రోజువారీ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ప్రమాదకర క్యాన్సర్ ముప్పును కూడా అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తరచూ పెరుగు తింటే జీర్ణకోశం మొత్తాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుందని, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా వారానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్ ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కంటే కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైందట. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మాస్ జనరల్ బ్రిఘం పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పేగుల్లోని బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గటానికి వీలవుతోందని భావిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా లక్షా 50వేల మందికి పైగా వ్యక్తుల నుంచి డేటాను పరిశోధకులు విశ్లేషించారు. పెరుగును క్రమం తప్పకుండా తినే వ్యక్తులలో పెరుగులోని బిఫిడోబాక్టీరియం వల్ల ప్రాక్సిమల్ కొలెరెక్టల్ క్యాన్సర్ (పెద్ద పేగు కుడి వైపున సంభవిస్తుంది) వచ్చే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు.
"పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది పేగులు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది" అని ఈ అధ్యయనం సహ-సీనియర్ రచయిత, హార్వర్డ్ చాన్ స్కూల్‌లో ఎపిడెమియాలజీ విభాగంలో అసోసియేట్, బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో పాథాలజీలో బోధకురాలు టొమోటకా ఉగై అన్నారు.
పెరుగు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:
- పెరుగులోని కాల్షియం ఎముకల బలాన్ని, దృఢత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని అంటున్నారు.
- పెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయని చెబుతున్నారు.
- పెరుగులోని ప్రోబయోటిక్స్ - మలబద్ధకం, అతిసార వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.
- పెరుగులో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుందని, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
- రోజూ పెరుగు తినడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి. 2017లో "European Journal of Cancer Prevention"లో ప్రచురించిన నివేదిక ప్రకారం రోజుకు 50 గ్రాముల పెరుగు (సుమారు 1/2 కప్పు) తినే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నోటి దుర్వాసనతో పెద్దపేగు క్యాన్సర్ ముప్పు - పరిశోధనలో నమ్మలేని నిజాలు!
ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!