ఫిరాయింపుదారులపై న్యాయ పోరాటానికి సిద్ధం చేయండి: ఠాగూర్ - సీఎల్పీ సమావేశానికి హాజరైన మాణిక్కం
భట్టి విక్రమార్క నేతృత్వంలో సీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హాజరై... దిశానిర్దేశం చేశారు. పార్టీ ఫిరాయింపుదారులపై న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైన ఆధారాలు సిద్ధం చేయాలని సూచించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు. పార్టీ పిరాయింపులపై న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేయాలని, తాను కూడా సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తానని చెప్పినట్టు సమాచారం.
రెండు రోజులుగా పార్టీ సమావేశాలు జరుగుతుండగా కోర్‌కమిటీ సమావేశానికి, దుబ్బాక నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మాణిక్కం ప్రశ్నించగా... వ్యక్తిగత కారణాలతో రాలేకపోయానని... ఇంకోసారి జరగదని జగ్గారెడ్డి వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. సీఎల్పీ సమావేశం తరువాత జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఠాగూర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు పీసీసీని మార్చొద్దని విజ్ఞప్తి చేసినట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఒకవేళ మార్పు తప్పదన్నప్పుడు తనకు అవకాశం కల్పించాలని బయోడేటాను ఠాగూర్‌కు అందచేసినట్టు వివరించారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టాలని జగ్గారెడ్డి సూచించినట్టు సమాచారం. రెండు రోజుల పార్టీ సమావేశాలతో నాయకుల్లో, కార్యకర్తల్లో నూతనొత్సాహాం వచ్చినట్టు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, బోస్ రాజు కూడా హాజరయ్యారు.
ఇదీ చూడండి: ప్రతి కార్యకర్తను కలుస్తా.. పార్టీని బలోపేతం చేస్తా: మాణిక్కం ఠాగూర్