ETV Bharat / city

100 శాతం నియంత్రిత సాగు... శుభసూచకం.. స్ఫూర్తిదాయకం - cm kcr on regulatory farming policy

తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ప్రక్రియను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వానాకాలం పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని... ఇది గొప్ప పరివర్తనగా అభివర్ణించారు.

cm kcr
cm kcr
author img

By

Published : Jul 12, 2020, 7:21 AM IST

ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు వందశాతం నియంత్రిత విధానంలో పంటలు సాగుచేస్తుండటం శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాందని పేర్కొన్నారు. రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఉన్నా గుర్తించి అందించాలని ఆదేశించారు. రైతుబంధు అమలు, ఇతర వ్యవసాయ పథకాలపై శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, రామకృష్ణారావు, జనార్దన్‌రెడ్డి, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

దసరా నాటికి రైతు వేదికలు

తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోంది. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ప్రక్రియను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టాయి. వాటి నిల్వకు అత్యాధునిక శీతలగిడ్డంగి అవసరం. దీని నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేస్తాం. ఏడాదిలోగా దీన్ని అందుబాటులోకి తేవాలి. రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలి. ఇవి పూర్తయితే రైతులకు రక్షణ వేదికలవుతాయి. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వానాకాలం పంటలు సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన.

-కేసీఆర్, సీఎం

ఇది గొప్ప పరిణామం

నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమని సీఎం పేర్కొన్నారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. ఇది శుభసూచకని... తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తోందని వెల్లడించారు.

రైతుబంధు సాయానికి గడువేమీ లేదు.

కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేశాం. ఇప్పటివరకు 99.9 శాతం మంది రైతులకు సాయం అందింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. రైతుబంధు సాయానికి గడువేమీ లేదు. మంత్రులు తమ జిల్లాల్లో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయాలపై నివేదిక సమర్పించాలి.

-కేసీఆర్, సీఎం

ఇలా చేయండి

కాస్తులో(సాగులో) ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యలుండటం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి... సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకామైనా(క్షేత్రస్థాయిలో విచారణ) నిర్వహించాలన్నారు. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలని... ఒకసారి పరిష్కారమైతే, ఎప్పటికీ గొడవ ఉండదని పేర్కొన్నారు.

లక్ష్మాపూర్‌కు రికార్డే లేదు...

మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని సీఎం అన్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే చేసి ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించిందని వివరించారు. మిగతా చోట్ల కూడా అదే జరగాలని సీఎం చెప్పారు

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.