ముఖ్యమంత్రి కేసీఆర్ సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై విచారం వ్యక్తం చేశారని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఘటన పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నిందితుడిని వీలైనంత త్వరలో పట్టుకొని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మహమూద్ అలీ చెప్పారు. హత్యాచార ఘటన... నిందితుడి గాలింపునకు సంబంధించి హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌తో పాటు... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు. నిందితుడి గాలింపునకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి... హోంమంత్రికి వివరించారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు సమన్వయం చేసుకొని గాలిస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలని... జనసమర్థ ప్రాంతాల్లో నిందితుడి ఫొటోలను ప్రచారం చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. వరంగల్‌లో చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించిందని... సైదాబాద్ హత్యాచార ఘటనలోనూ చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలని మహమూద్ అలీ డీజీపీని ఆదేశించారు.
ఇదీ చదవండి: Saidabad Incident: చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది: పవన్‌కల్యాణ్