కర్ణాటకలో సినీ ఫక్కీలో 22ఏళ్ల తర్వాత తల్లీకూతుళ్లు కలుసుకున్నారు. 9 ఏళ్ల వయసులో తప్పిపోయిన కూతురు తిరిగి ఇంటికి రాగా.. చిక్కమంగళూరు జిల్లాకు చెందిన చైత్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకాలం తర్వాత తల్లీబిడ్డలు కలవడం వల్ల వారి ఇంటి వద్ద సందడి వాతావరణ నెలకొంది.
తమిళనాడుకు చెందిన చైత్ర అనే మహిళ 30 ఏళ్ల వయసులో ఉపాధి నిమిత్తం కర్ణాటకకు వలస వచ్చింది. చిక్కమంగళూరు జిల్లాలోని ముడిగిరి ప్రాంతంలో ఓ కాఫీ ఎస్టేట్‌లో పని చేస్తూ అక్కడే నివాసం ఉండేంది. ఆమె కూతురు అంజలి 9 ఏళ్ల వయసులో ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెనక్కి వచ్చేందుకు దారి తెలియక.. ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. కేరళకు చెందిన మహోత్ అనే వ్యక్తి చిన్నారిని గమనించి, ఆమె వివరాలు అడిగే ప్రయత్నం చేసినా అంజలి చెప్పే పరిస్థితిలో లేదు. మహోత్ ఆమెను తనతో పాటు కేరళకు తీసుకెళ్లాడు. అంజలిని కన్న కూతురిలా పెంచి పెద్ద చేసిన మహోత్.. ఆమెకు నెళ్లమణి సాజి అనే వ్యక్తితో వివాహం కూడా చేశాడు.
చిన్నతనం నుంచే తన తల్లి ఆచూకీ గురించి ఆరా తీస్తున్న అంజలి.. వివాహం తర్వాత తన భర్తకు విషయం చెప్పింది. గత మూడేళ్లుగా తల్లి కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో మంగళూరు కేంద్రంగా పనిచేసే ఓ సామాజిక కార్యకర్త అంజలికి సహకరించింది. ఆమె సహాయంతో చివరకు అంజలి తన తల్లి చైత్ర కర్ణాటకలో ఉన్నట్లు తెలుసుకొని ఆమె చెంతకు చేరింది.
22 ఏళ్ల తర్వాత కన్న కూతురును చూసిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 9 ఏళ్ల వయసులో తప్పిపోయిన అమ్మాయి ఇప్పుడు తిరిగి రాగా.. ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి:
రన్నింగ్ ట్రైన్ నుంచి పడిన చిన్నారి.. కాపాడబోయి తల్లి కూడా...