What is Bharatpol : 'భారత్ పోల్' పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో 'భారత్ పోల్'ను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. విదేశాలకు పరారైన నేరగాళ్లను దర్యాప్తు సంస్థలు భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు 'భారత్ పోల్' విభాగం దోహదం చేస్తుందన్నారు.
ఈ కొత్త వ్యవస్థతో పాటు మూడు నేరచట్టాలపై రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకుంటుందని అమిత్ షా తెలిపారు. "దేశానికి చెందిన అంతర్జాతీయ దర్యాప్తును మరో యుగంలోకి తీసుకెళ్లే అడుగు ఇది. ఇప్పటివరకు ఇంటర్‌పోల్‌తో భారత్ తరఫున సీబీఐ మాత్రమే సమన్వయం చేసుకునేది. ఇకపై భారత్‌పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్‌పోల్‌ను సంప్రదించొచ్చు" అని కేంద్ర హోం మంత్రి చెప్పారు. "భారత్ పోల్ పోర్టల్ ద్వారా ప్రపంచంలో జరిగే అనేక నేరాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. అలాంటి నేరాలు భారత్‌లో జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు" అని అమిత్‌షా వివరించారు.
భారత్ పోల్ పోర్టల్ విశేషాలివీ
- తక్షణ సమాచార బదిలీ : భారత్‌పోల్ పోర్టల్ ద్వారా మనదేశంలోని దర్యాప్తు సంస్థల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుంది. విదేశీ దర్యాప్తు సంస్థలతో భారత దర్యాప్తు సంస్థల సమన్వయం, సమాచార మార్పిడి వేగవంతమవుతాయి.
- అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తునకు కేంద్రీకృత వేదిక : వివిధ కేసులకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితులు, నేరగాళ్ల వివరాలను భారత్‌పోల్ పోర్టల్ వేదికగా ఇంటర్‌పోల్‌కు, వివిధ దేశాల దర్యాప్తు సంస్థలకు పంపొచ్చు. రెడ్ కార్నర్ నోటీసుల అంశంపై సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చిపుచ్చుకోవచ్చు.
- పోలీసులు, దర్యాప్తు సంస్థల సమన్వయం : మనదేశంలోని కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పర సమన్వయం కోసం భారత్‌పోల్ పోర్టల్‌ను వాడుకుంటాయి. అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా దీన్ని వేదికగా చేసుకొని కమ్యూనికేషన్ చేసుకుంటాయి.
- అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ : లెటర్లు, ఈమెయిల్స్, ఫ్యాక్సులు వంటి పాత తరహా కమ్యూనికేషన్ వ్యవస్థల స్థానాన్ని భారత్‌పోల్ పోర్టల్ భర్తీ చేస్తుంది. డిజిటల్ మాధ్యమంలో వేగంగా సమాచార బదిలీ జరుగుతుంది. సీబీఐ, ఇంటర్‌పోల్ మధ్య కమ్యూనికేషన్ మునుపటి కంటే మెరుగు అవుతుంది.
- ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లకు చేదోడు : అంతర్జాతీయ మద్దతు అవసరమైన సున్నితమైన కేసుల్లో పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల టెక్నికల్ టూల్స్‌ను, వాటిపై గైడెన్స్‌ను భారత్‌పోల్ పోర్టల్ అందిస్తుంది.
- సత్వర స్పందన : కేసులను త్వరగా పరిష్కరించాలంటే దర్యాప్తు విభాగాల సత్వర స్పందన, సమన్వయం అత్యవసరం. అంతర్జాతీయ స్థాయిని కలిగిన కేసుల్లోనూ ఇది కీలకం. ఈ లోటును ఇక నుంచి భారత్‌పోల్ పోర్టల్ తీర్చబోతోంది.