Delhi Assembly Elections Schedule : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 70 శాసనసభ స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : జనవరి 10
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: జనవరి 17
- నామినేషన్ల పరిశీలన: జనవరి 18
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 20
- పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 5
- ఎన్నికల ఫలితాల తేదీ: ఫిబ్రవరి 8
PTI INFOGRAPHICS | Delhi Assembly Election 2025: ECI announces polling schedule; voting in single phase on Feb 5, counting of votes on Feb 8.
— Press Trust of India (@PTI_News) January 7, 2025
Check full schedule here:#DelhiElectionsWithPTI pic.twitter.com/hTIaHEzuRV
2025లో దిల్లీ అధికార పీఠం ఎవరిది?
దిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 23తో ముగియనుంది. గతంలో 2020 ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి, అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది, బీజేపీ 8మంది ఎమెల్యేలు ఉన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్, వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆప్ 70మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి.
ముక్కోణపు పోరు!
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. హస్తిన వేదికగా ఈ మూడు పార్టీల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆప్ ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, ప్రచార వేగాన్ని పెంచింది. మునుపెన్నడూ లేని స్థాయిలో దిల్లీ ప్రజలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీల జల్లును కురిపిస్తున్నారు. ఆప్‌నకు పోటీ పెరిగినందు వల్లే ఆయన వరుస పెట్టి హామీలను ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్నారు. సీఎం ఆతిశీ, ఆప్ సీనియర్ నాయకురాలు కల్కాజీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు.
బరిలో కీలక బీజేపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మను అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీకి బీజేపీ నిలిపింది. సీఎం అతిషిపై పోటీకి మాజీ ఎంపీ రమేశ్ బిధూరిని కమలదళం బరిలోకి దింపింది. 29 మంది అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ, రమేశ్ బిధూరి పేర్లు ఉన్నాయి. ఇటీవల బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి కైలాశ్ గహ్లోత్‌కు బిజ్వాసన్ అసెంబ్లీ నుంచి పోటీగా నిలబెట్టింది. అలాగే రాజ్ కుమార్ ఆనంద్‌ను పటేల్ నగర్ నుంచి, దిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీని గాంధీ నగర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది.
కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ కీలక నేత పోటీ
కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పటికే 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. దిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేయనున్నారు. 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో షీలా దీక్షిత్‌ను అరవింద్ కేజ్రీవాల్ ఓడించారు. సందీప్ దీక్షిత్ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇక కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీపై పోటీ చేసేందుకు అల్కా లాంబాను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది.