Israel Strikes On Gaza : దక్షిణ గాజాపై ఇజ్రాయెలీ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 17 మంది గాజా పౌరులు మరణించారు. చనిపోయిన వారిలో చాలా మంది మహిళలు, పిల్లలే ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒకే టెంటు కింద ఆశ్రయం పొందుతున్న ఐదుగురు పిల్లలు చనిపోయారని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని నాసిర్ ఆస్పత్రి పిల్లల వార్డు డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. ఇద్దరి మృతదేహాలను గుర్తుపట్టలేకపోయినట్లు చెప్పారు. ఇక ఈ దాడిపై ఇజ్రాయెలీ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన పలువురు మిలిటెంట్లు లక్ష్యంగా ఈ దాడి చేశామని తెలిపింది. ప్రాణ నష్టం సాధ్యమైనంత తక్కువ జరిగేలా తాము జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
నేను అధ్యక్ష పదవిని చేపట్టేలోగా!
కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. జనవరి 20న తాను అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టేలోగా ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్‌కు తేల్చి చెప్పారు. ‘‘ఇజ్రాయెలీ బందీలు, అమెరికా బందీలంతా ఇజ్రాయెల్‌కు తిరిగి చేరాలి. లేదంటే నేను ఊరుకోను. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రక్రియను అడ్డుకోవాలని నేను భావించట్లేదు. నేను అధ్యక్ష పదవిని చేపట్టేలోగా బందీలను హమాస్ వదలకుంటే పశ్చిమాసియాలో ప్రళయం సృష్టిస్తా’’ అని ఫ్లోరిడాలోని మారా లాగోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ‘‘2023 అక్టోబరు 7 తరహా ఉగ్రదాడి మళ్లీ జరగకూడదు. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో చాలా మంది అమెరికా పౌరులు కూడా ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతుంటే నేను కళ్లారా చూశాను. బందీలను హమాస్ దారుణంగా చంపడాన్ని చూసి నా మనసు కకావికలమైంది. 19 నుంచి 20 ఏళ్ల వయసున్న ఒక బాలికను హమాస్ ఉగ్రవాదులు దారుణంగా చంపిన వార్తలను నేను చూశాను’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా బందీల విడుదలపై హమాస్‌తో చర్చలు చివరిదశలో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా మేం కసరత్తు చేస్తున్నాం. కొంతమంది ప్రాణాలను కాపాడగలమని ఆశిస్తున్నాం’’ అని పశ్చిమాసియా ప్రాంతం కోసం డొనాల్డ్ ట్రంప్ నియమించిన ప్రత్యేక రాయబారి స్టీవెన్ ఛార్లెస్ విట్‌కాఫ్ వెల్లడించారు.