Magha Puranam 10th Chapter In Telugu : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో పదవ అధ్యాయంలో ఇంద్రుడు గాడిద ముఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం
రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతలు ఇంద్రుడు ఆచూకీ తెలుసుకోడానికి మునీశ్వర్ల సూచన మేరకు మాఘస్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించారు. వారి వ్రతానికి సంతృప్తి చెందిన ఆ శ్రీహరి శంఖచక్ర గదాధరుడై దేవతలకు దర్శనమిస్తాడు. అపుడు దేవతలు శ్రీహరిని అనేక విధాలుగా కొనియాడుతారు.
తమ దీనావస్థను శ్రీహరికి విన్నవించిన దేవతలు
దేవతలు ఆ హరిని "ఓ శ్రీహరీ! పూర్వం ఆదిశేషువు తన వేయి ముఖములతో నిన్ను ప్రార్ధించి నీకు శయ్యగా మారాడు. అలాగే శేషువుకు శత్రువు అయిన గరుత్మంతుడు తన స్వామి భక్తితో నూరు యుగములు తపస్సు చేసి నీకు వాహనంగా మారాడు. నీ కరుణ అంతులేనిది. మేము దేవతలం. రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి విచారంతో ఉన్నాం. ఇప్పుడు ఇంద్రలోకంలో ఇంద్రుడు లేదు. ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు. నిన్ను శరణు వేడుతున్నాం. ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలిపి మమమ్మల్ని ఉద్ధరించుము. మమ్మల్ని రాక్షసుల నుంచి రక్షింపుము అని వేడుకుంటున్న దేవతలను చూసి అపారమైన కరుణతో ఆ శ్రీహరి దేవతలతో ఇలా అన్నాడు.
దేవతలకు ఇంద్రుని సమాచారం చెప్పిన శ్రీహరి
దేవతలు చేసిన స్తోత్రాలకు ప్రసన్నుడైన ఆ శ్రీహరి దేవతలతో "దేవతలారా! ఇంద్రుడు మిత్రవిందుడనే బ్రాహ్మణుని శాపం చేత గాడిద ముఖం కలిగి పద్మావతి పర్వతం మీద ఉన్నాడు. ఇంద్రునికి ఆ శాపం ఎలా కలిగిందో చెప్తాను వినండి. ఇంద్రుడు మిత్రవిందుడనే మునిపత్ని మీద మొహంతో ఆమెతో రమించి చెయ్యరాని పాపం చేసాడు. ఇది తెలిసిన మిత్రవిందుడు తన తపోబలంతో ఇంద్రుని గాడిద ముఖం కలిగి ఉండమని, తన భార్యను పాషాణంగా అరణ్యంలో పడి ఉండమని శపించాడు. ఆనాటి నుంచి ఇంద్రుడు గాడిద ముఖంతో పద్మావతి పర్వతం మీద గడ్డి గాదం తింటూ తీవ్రమైన ఎండలో పడి ఉన్నాడు.
ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి
ఇంద్రునికి ఋషిపత్ని సంగమ దోషం పోవాలంటే మాఘమాసంలో ఇంద్రుని ఎలాగైనా తీసుకెళ్లి తుంగభద్రా నదీ జలాలలో సంకల్ప స్నానం చేయిస్తే దోషం తొలగిపోతుంది" అని శ్రీహరి చెప్పిన మాటలు విన్న దేవతలు "హరీ! ఇంద్రునికి గాడిద ముఖం ఎలా పోతుంది" అని అడుగగా అప్పుడు ఆ శ్రీహరి "దేవతలారా! మహిమాన్వితమైన మాఘ స్నానం చేయగానే ఇంద్రుని దోషం పోయి గాడిద ముఖం తొలగిపోయి తిరిగి పూర్వం రూపం వస్తుంది. మాఘ స్నానానికి అంతటి మహత్యం ఉంది. పూర్వం విశ్వామిత్రుడు మాఘ స్నానంతో తన వానర ముఖాన్ని పోగొట్టుకున్నాడు. ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి" అంటూ శ్రీహరి దేవతలకు విశ్వామిత్రుని ఉదంతం చెప్పడం మొదలు పెట్టాడు.
విశ్వామిత్రునికి వానర రూపం
పూర్వం విశ్వామిత్ర మహర్షి భూలోక ప్రదక్షిణం చేస్తూ గంగా తీరానికి చేరుకున్నాడు. అదే సమయానికి కొంతమంది గంధర్వులు ఆకాశమార్గంలో వచ్చి గంగానదిలో మాఘ స్నానం చేసి శ్రీహరిని భక్తితో పూజించి తిరిగి ఆకాశమార్గంలో ప్రయాణమై పోవుచున్నారు. వారిలో ఒక గంధర్వుని భార్య మాత్రం చలి కారణంగా మాఘ స్నానం చేయక మిన్నకుండెను. ఆమె గురించి మర్చిపోయిన గంధర్వులు ఆకాశమార్గంలో వెళ్లిపోయారు. మాఘ స్నానం చేయని ఫలితంగా ఆ గంధర్వుని భార్యకు ఆకాశమార్గంలో వెళ్లే శక్తి నశించింది. ఆమె విచారంతో అరణ్యాలలో తిరుగుచుండగా విశ్వామిత్రుడు ఆమెను చూసాడు. అతిలోక సౌందర్యవతి అయిన ఆమెను చూసి విశ్వామిత్రుడు మోహావేశంతో ఆమెతో సంగమించాడు. అదే సమయంలో భార్యను వెతుకుతూ వచ్చిన గంధర్వుడు ఇది చూసి విశ్వామిత్రుని వానర ముఖంతో పడి ఉండమని శపించాడు. అతని భార్యని అరణ్యంలో పాషాణమై పడి ఉండమని శపించాడు. ఈ విధంగా వారు 12 సంవత్సరాలు గడిపారు. ఒకనాడు నారద మహర్షి అక్కడకు వచ్చి వానర ముఖంతో ఉన్న విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యపోయి తన దివ్యదృష్టితో చూసి జరిగింది తెలుసుకున్నాడు.
విశ్వామిత్రునికి శాపవిమోచనం
విశ్వామిత్రుని దురవస్థ చూసు నారదుడు "అయ్యో ! విశ్వామిత్రుడు క్షణికమైన మొహంతో తపోభ్రష్టుడైనాడు. ఎలాగైనా ఇతనికి ఈ దురవస్థ తప్పించాలనుకొని మాఘ మాసంలో సూర్యోదయ కాలంలో విశ్వామిత్రునిచే సంకల్ప పూర్వకంగా గంగా స్నానం చేయించాడు. మాఘ స్నాన ఫలంతో విష్ణువునైన నా అనుగ్రహంతో విశ్వామిత్రుని వానర రూపం పోయింది. నారదుడు విశ్వామిత్రుడు తపస్సు చేసుకోడానికి వెళ్తూ పాషాణంలా పడిఉన్న గంధర్వుని భార్యపై నదీ జలాలను చల్లగా ఆమె తన పూర్వపు సుందరమైన రూపంతో ప్రత్యక్షమైంది. చివరకు ఆమె కూడా నదీ స్నానం చేసి తన లోకానికి వెళ్లిపోయింది. ఈ విధంగా శ్రీహారి దేవతలకు విశ్వామిత్రుని కథను చెప్పి ఇంద్రునికి కూడా మాఘ స్నానం చేయించి గాడిద రూపం నుంచి విముక్తి కలిగించమని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ కథను గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం ద్వారా శివుడు పార్వతికి తెలియజేస్తూ పదో రోజు అధ్యాయాన్ని ముగించాడు. ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! దశమాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.