Students Addicted To Smartphones : మైదానంలో ఆడుకోవాల్సిన చిన్నారులు స్మార్ట్ ఫోన్లలో బందీ అవుతున్నారు. పాఠశాలల్లో ప్రాజెక్టు వర్క్స్ ఇచ్చినా గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా సృజనాత్మకతను కోల్పోవడంతో పాటు, అనేక రుగ్మతలకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా 14 నుంచి 16 ఏళ్లలోపు వారిలో 82 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లుగా వార్షిక విద్యా స్థాయి నివేదిక (అసర్ రిపోర్ట్) తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అసర్ సర్వే ప్రకారం సోషల్ మీడియా వినియోగం ఇలా :
- 14 ఏళ్ల వారు - 79శాతం మంది
- 15 ఏళ్ల వారు -82.2శాతం
- 16 ఏళ్ల వారు - 82.5శాతం
ఇటీవల ఘటనలు ఇవి :
- గద్వాలలో ఓ విద్యార్థి స్మార్ట్‌ఫోన్ అధికంగా వినియోగించడం వల్ల కంటిచూపు మందగించింది. మానసిక సమస్యతో చదువులో క్రమంగా వెనుకబడిపోయాడు.
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు ఇటీవల తన తండ్రి స్మార్ట్ ఫోన్లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలు పోగొట్టాడు.
- ఉమ్మడి జిల్లాలోని 6,911 మంది విద్యార్థుల్లో కంటి సమస్యలున్నట్లుగా ఆర్‌బీఎస్‌కే వైద్యుల పరీక్షల్లో తెలిసింది. ఇందులో 50 శాతానికిపైగా స్మార్ట్ ఫోన్ కారణమని వైద్యులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో చట్టం : 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు. తనలాగ ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత గురించి కలత చెందుతున్న తల్లిదండ్రుల కోసం తీసుకొస్తున్న చట్టం ఇదని ఆయన అన్నారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
"స్మార్ట్ఫోన్లను పిల్లలను దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఆటలు ఆడించడం, వీలైతే వారితో కలసి ఆడటం ఉత్తమం. స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సమయం గడిపే వారు ఎవ్వరితో మాట్లాడేందుకు ఇష్టపడరు. అరవడం, వాగ్వాదం చేస్తుంటారు. పరిస్థితి మితిమీరినట్లయితే డిప్రెషన్‌లోకి వెళ్తారు"- డా.హేమలత, మానసిక వైద్య నిపుణురాలు, గద్వాల
తల్లిదండ్రులు ఏం చేయాలి
- స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే అనర్థాల గురించి తరచూ పిల్లలకు వివరించాలి.
- స్కూల్ నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి వారితో హోమ్‌వర్క్ చేయించాలి.
- హోమ్ వర్క్ వచ్చిందని పిల్లలకు చరవాణి ఇచ్చి వదిలేయరాదు. వారిని గమనించాలి. పాఠ్యాంశాలకు మాత్రమే వినియోగించేలా చూడాలి.
- పిల్లలకు వీలైనంత వరకు డిజిటల్ తెరలకు దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. శారీరక శ్రమ కలిగించే విధంగా గేమ్స్ ఆడించడం, నైపుణ్యాలను పెంచే విధంగా తల్లిదండ్రులు వారికి సూచనలు చేయాలి.
- పిల్లలున్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ వాడకపోవడం మంచిది. లేదంటే పెద్దలు చూసే సోషల్ మీడియా, వీడియోలు, రీల్స్‌కు పిల్లలు త్వరగా అలవాటు పడే అవకాశముంది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడకుండా చూడాలి.
- స్మార్ట్‌ఫోన్‌కు బానిసలు కాకుండా చూడాలి.
బాల్యం నుంచే స్మార్ట్‌ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!
మీ పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే జన్మలో మొబైల్ పట్టుకోరు