Super Check On Indiramma House APP : ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయా? యాప్‌లో ప్రజాపాలన అప్లికేషన్ల వివరాలనే నమోదు చేస్తున్నారా? అర్జీదారుల ప్రయోజనాల కోసం సర్వేయర్లు ఏమైనా తప్పుడు సమాచారాన్ని ఎంటర్ చేశారా? అనే అంశాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ‘సూపర్ చెక్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సూపర్‌చెక్ కార్యక్రమానికి శ్రీకారం : ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలికల్లో వార్డు అధికారులతోపాటు కొన్ని చోట్ల ఇతర సిబ్బందిని యాప్ సర్వే కోసం సర్కారు ఎంపిక చేసింది. వీరు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సర్వే చేపడుతున్నారు. ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలను సేకరించారు.
సర్వే పూర్తయినటువంటి వాటిలో సూపర్ చెక్ పేరుతో ఐదు శాతం(4.02 లక్షలు) దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆ శాఖ పీడీ(ప్రాజెక్ట్ డైరెక్టర్), గ్రామాల్లో ఎంపీడీవో(మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్), పురపాలికల్లో కమిషనర్ల లాగిన్‌కు పంపిస్తున్నారు. వీరు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్‌లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో? లేదో? అనే అంశాన్ని మరోసారి పరిశీలిస్తారు. ఎక్కడైనా తప్పుడు వివరాలు నమోదు చేసినట్లుగా తేలితే సర్వేయర్లపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
సంక్రాంతి తర్వాత గ్రామసభలు : జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) మినహాయిస్తే రాష్ట్రంలో ప్రజాపాలనలో మొత్తం 69,83,895 అప్లికేషన్ వచ్చాయి. వీటిలో 65,22,849(93శాతం) దరఖాస్తులకు సంబంధించి యాప్ సర్వే పూర్తయ్యింది. సంక్రాంతిలోపు 32 జిల్లాల్లో ఈ సర్వే పూర్తి కానుంది. జీహెచ్‌ఎంసీలో మాత్రం మరింత సమయం పట్టే అవకాశముంది. సర్వే పూర్తయిన జిల్లాల్లో సాధ్యమైనంత వేగంగా ‘సూపర్ చెక్’ పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు.
జనవరి నెలఖరులోగా లబ్ధిదారుల జాబితా : ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి జాబితాను రూపొందించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలను చేస్తున్నారు. ఇందులోనే అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఉండనుంది. ఇందిరమ్మ కమిటీలు ఈ లబ్ధిదారుల ఎంపికలో ముఖ్య పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలను ఉమ్మడి జిల్లాలక ఇన్‌ఛార్జి మంత్రులు ఆమోదించారు. ఎక్కడైనా కమిటీలు ఏర్పాటు కాకపోతే ఈ వారం రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - నెలాఖరులోగా మంజూరు
సర్వే ముగిసింది - ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? - అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులు