Actress Honey Rose Media Harassment : సామాజిక మాధ్యమాల వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇటీవల చేసిన ఫిర్యాదుకు సంబంధించి మలయాళ నటి హనీరోజ్ వాంగ్మూలాన్ని కేరళ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే 30మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరోవైపు నటి హనీరోజ్‌కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) మద్దతు ప్రకటించింది.
కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో హనీరోజ్ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. విచారణ చేపట్టిన పోలీసులు హనీరోజ్ వాంగ్మూలం నమోదు చేశారు. ఇప్పటికే 30మంది కేసు నమోదు చేసి పోలీసులు, షాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అభ్యంతకరంగా పోస్టులు పెట్టిన చాలా మంది వాటిని తర్వాత తొలగించారని వెల్లడించారు. ఆ పోస్టులను వెలికితీస్తున్నామని వాటి ద్వారా నిందితులను గుర్తించనున్నట్లు పోలీసులు తెలిపారు.
'హనీ రోజ్‌కు న్యాయ సాయం చేస్తాం'
మరోవైపు నటి హనీ రోజ్‌కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం(అమ్మ) మద్దతు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అభ్యంతరకంగా పెడుతున్న పోస్టులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఓ లేఖ విడుదల చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించిన మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది.
ఇదీ జరిగింది
ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ ఆదివారం(జనవరి 5) సాయంత్రం హనీరోజ్ ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని తనను అవమానించడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు. సదరు వ్యాపారవేత్త గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయినట్లు హనీ రోజ్ చెప్పారు. అందుకు ప్రతీకారంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆరోపించారు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలను తాను స్వీకరిస్తానని హనీరోజ్ తెలిపారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను స్వాగతిస్తానని, అయితే వాటికీ ఒక హద్దు ఉంటుందని అన్నారు. అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించబోనని, అలాంటి కామెంట్స్ చేసేవారిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు నటి హనీరోజ్ తెలిపారు.