Champions Trophy 2025 : ఎన్నో చర్చల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణ విషయం ఓ కొలిక్కి వచ్చింది. హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓకే చెప్పడంతో షెడ్యూల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో గత డిసెంబర్లో ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ కూడా రిలీజైంది. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ మార్చి 9న ముగియనుంది.
పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగేలా ఒప్పందం ప్రకారమే షెడ్యూల్ విడుదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం పీసీబీకి ఐసీసీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీని పూర్తిగా వేరే దేశానికి షిఫ్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కారణం ఏంటంటే?
ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని గడాఫీ, లాహోర్, కరాచీ స్టేడియాల్లో జరగాల్సి ఉంది. ఈ స్టేడియాల రెనోవేషన్ పనుల కోసం పీసీబీకి ఐసీసీ ఇప్పటికే భారీగా ఆర్థిక ప్రోత్సాహం అందించింది. అయితే ఈ పనులన్నీ 2024 డిసెంబర్ వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ, సమయం గడుస్తున్నా స్టేడియాల్లో ఇప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సీట్ల పుణరుద్ధరణ, ఫ్లడ్‌లైట్ల ఏర్పాట్లు, ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్స్ రెనొవేషన్, ఇతర సౌకర్యాలు ఇలా అనేక పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Condition of Pakistan cricket stadiums:
— Johns (@JohnyBravo183) January 8, 2025
Less than a month left for Champions Trophy and nothing's even 50% ready.
AFG, AUS, SA & ENG will play their matches here, so good luck to their fans, players and journalists. pic.twitter.com/p6ZynuAajI
ఈ పనులన్నీ ఫిబ్రవరి 12 వరకు పూర్తిచేసి స్టేడియాలను ఐసీసీకి అప్పగించే ఛాన్స్ ఉందట. అయితే పీసీబీ వైఖరిపై ఐసీసీ సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. దీంతో మైదానాల పునరుద్ధరణ పట్ల ఆలస్యం వహిస్తున్నందుకు ఏకంగా టోర్నీని పాక్ నుంచి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తుందట! ఈ పుణరుద్ధరణ పనులను పరిశీలించేందుకు ఐసీసీ నుంచి ఓ బృందం త్వరలోనే పాక్‌లో పర్యటించనుందని తెలుస్తోంది. అప్పుడే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి పీసీబీపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుదో?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ