CM Revanth Reddy on Indiramma Houses : ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్టీ కోసం పోరాడిన అందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించామని, పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు ఉండవని వెల్లడించారు. గల్లీ నుంచి పోరాడితేనే దిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుందని, కేవలం డబ్బులతోనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని అనుకోవద్దని అన్నారు.
డబ్బుతోనే గెలిచేది ఉంటే కేసీఆర్‌కు వంద సీట్లు వచ్చి ఉండేవని, కేసీఆర్ లారీల్లో డబ్బు తరలించినా బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారని, ప్రజల్లో ఉండి సమస్యలపై పోరాడితేనే ప్రజలు ఆదరిస్తారని రేవంత్ రెడ్డి వివరించారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు ఊర్ల మీద పడ్డారని ఎద్దేవా చేశారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : తొలి ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. తొలి ఏడాదిలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని, తొలి ఏడాదిలోనే 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి చూపించామని, ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ల పోరాటం జరిగిందని, ఎందరో ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. సోషల్ మీడియాలో విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని వెల్లడించారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పదవులకు రాజీనామా చేయాలి : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బిహార్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు తప్ప ఎవరికీ నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమీ సాధించని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు దస్త్రాన్ని దిల్లీకి పంపితే ఇంతవరకు ఆమోదించలేదని, తాము సొంతంగా చేసుకుంటామని చెప్పినా, మెట్రోకు ఆమోదం తెలుపలేదని అన్నారు. ట్రిపుల్ ఆర్‌ను సగం ఆమోదించి సగం పక్కకు పెట్టారని తెలిపారు.
"పార్టీ కోసం పోరాడిన అందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు ఉండవు. గల్లీ నుంచి పోరాడితేనే దిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుంది."- రేవంత్ రెడ్డి, సీఎం
రెండేళ్లలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం - సీఎం ఆదేశం