స్మార్ట్ యుగం ఇది. అన్నీ ఇన్‌స్టాంట్‌గా దొరుకుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల ఛార్జింగ్ సైతం సెకన్స్‌లో ఫుల్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ దిశగా ఫోన్ల ఛార్జింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించే ఆవిష్కరణ ఒకటి జరిగింది. స్వైప్ చేసిన 2 సెకన్లలోనే ఫోన్‌లోని బ్యాటరీని ఫుల్ చేసే అధునాతన ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను స్విప్పిట్ (Swippitt) కంపెనీ విడుదల చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) వేదికగా స్విప్పిట్ కంపెనీకి చెందిన ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను ప్రదర్శించారు. దానిలోని ఫీచర్లు, పనితీరు గురించి తెలిపారు.
మూడు కీలక భాగాలు
Instant Phone Charger Swippitt : ఫోనులో ఛార్జింగ్ అయిపోగానే, ఛార్జింగ్ పెట్టడం అనేది పాత పద్ధతి. దానికి స్వస్తి పలికింది స్విప్పిట్ కంపెనీ. మూడు అద్భుత ఫీచర్లతో అధునాతన ఇన్‌స్టాంట్ ఛార్జింగ్ వ్యవస్థను స్విప్పిట్ తయారు చేసింది. ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది 'స్విప్పిట్ హబ్'. రెండోది 'స్విప్పిట్ లింక్'. మూడోది 'స్విప్పిట్ యాప్'.
స్విప్పిట్ హబ్ ఏం చేస్తుంది ?
స్విప్పిట్ కంపెనీకి చెందిన ఇన్‌స్టాంట్ ఛార్జింగ్ వ్యవస్థలో మొదటి భాగం 'స్విప్పిట్ హబ్'. ఇది ఒక డెస్కు. దీనిపై ఫోన్లను బిగించేందుకు వివిధ సైజుల హ్యాంగర్లు ఉంటాయి. వాటిని స్విప్పిట్ లింక్ అని పిలుస్తారు. వాటిలోనే మన ఫోన్లను బిగించాలి. ఫోన్లను ఛార్జింగ్ చేసేందుకు 'స్విప్పిట్ హబ్'లో ఐదు ఫుల్లీ ఛార్జ్‌డ్ బ్యాటరీలు సిద్ధంగా ఉంటాయి. వాటి నుంచి అందే సూపర్ ఫాస్ట్ విద్యుత్ వల్ల స్విప్పిట్ లింక్‌కు తగిలించిన 2 సెకన్లలోనే మన ఫోన్ ఛార్జింగ్ పూర్తవుతుంది. బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ ఏడాది(2025) జూన్ లోపు ఈ 'స్విప్పిట్ హబ్'ను అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేయాలని స్విప్పిట్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 'స్విప్పిట్ హబ్' అనేది ఐఓఎస్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్ని ప్రధాన మోడళ్ల ఫోన్లను ఛార్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఆ ఫోన్స్‌కు మాత్రమే
ప్రస్తుతం లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఐఫోన్ 14, 15, 16 మోడళ్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఉపయోగపడే 'స్విప్పిట్ హబ్'లను మాత్రమే ప్రదర్శించారు. తదుపరి విడతల్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు మద్దతునిచ్చే 'స్విప్పిట్ హబ్'లను ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల సైజుల ఫోన్లు ఇమిడిపోయేలా ‘స్విప్పిట్ హబ్'లను తయారు చేయనున్నారు. ఫోన్ సైజును బట్టి హ్యాంగర్‌ను మోడిఫై చేసుకునే వెసులుబాటును సైతం కల్పిస్తారట. స్విప్పిట్ హబ్ ద్వారా ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకునే క్రమంలో మానిటరింగ్ కోసం ప్రత్యేక యాప్ ఉంటుంది. ఇది స్విప్పిట్ హబ్, స్విప్పిట్ లింక్‌ల సమన్వయంతో ముడిపడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటుంది.
ధర ఎంత ?
స్విప్పిట్ హబ్ ధర దాదాపు రూ.38వేల (450 డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఛార్జింగ్ కోసం ఫోన్‌ను తగిలించే స్విప్పిట్ లింక్ కోసం అదనంగా రూ.10వేలు (120 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఈనెలలోనే ప్రీ ఆర్డర్లు ఇచ్చేవారికి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. లాస్ వెగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) సందర్భంగా జనవరి 17లోగా ఆర్డర్స్ ఇచ్చేవారికి అదనంగా 100 డాలర్ల రాయితీని అందిస్తామని స్విప్పిట్ కంపెనీ ప్రకటించింది. ప్రీ ఆర్డర్లు ఇచ్చేందుకు https://www.swippitt.comను చూడాలని కోరింది.