Gold Loan Interest Rates 2025 : బంగారంపై లోన్ ఆర్థిక ఆపత్కాలంలో ఎంతోమందిని ఆదుకునే సురక్షిత మార్గం. సాధ్యమైనంత త్వరగా డబ్బులు అవసరమైనప్పుడు ఇది ఉత్తమమైన ఆప్షన్‌గా ఉంటుంది. ఆస్తిని అమ్మకుండా నిధులను సమకూర్చుకునే తెలివైన పద్ధతి గోల్డ్ లోన్. మన దగ్గరున్న బంగారు ఆభరణాలు లేదా నాణేలను తనఖా పెట్టి బ్యాంకు లేదా ఆర్థికసంస్థ నుంచి రుణాన్ని పొందొచ్చు. తక్షణం నిధులను పొంది స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించి బంగారాన్ని తనఖా నుంచి విడిపించుకోవచ్చు
ఏ రకం బంగారంతో గోల్డ్ లోన్ పొందొచ్చు ?
గోల్డ్ లోన్ కోసం అన్ని రకాల బంగారం పనికి రాదు. అన్ని బ్యాంకులు బంగారు ఆభరణాలపై లోన్ ఇస్తుంటాయి. తనఖా పెట్టే బంగారం నాణ్యత 18కే నుంచి 22కే మధ్యలో ఉండాలని చెబుతుంటారు. ఎస్‌బీఐలోనైతే బంగారు ఆభరణాలతో పాటు బంగారు నాణేలను కూడా తనఖా పెట్టొచ్చు.
బుల్లెట్ రీపేమెంట్ పద్ధతి ఏమిటి ?
బంగారంపై అప్పులు తీసుకున్న వారి నుంచి రుణ వసూళ్లకు బుల్లెట్ రీపేమెంట్ పద్ధతిని వినియోగిస్తుంటారు. బంగారంపై రుణం తీసుకున్న వ్యక్తి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసే క్రమంలో వడ్డీతో పాటు అసలును కలిపి తీసుకునే పద్ధతినే బుల్లెట్ రీపేమెంట్ అంటారు. పసిడి రుణాన్ని తీర్చడానికి రుణగ్రహీత ఎన్ని నెలలైతే సమయాన్ని తీసుకున్నారో, అన్ని నెలలకు వడ్డీని లెక్క వేస్తారు. వడ్డీరేటు అనేది బ్యాంకులు/ఆర్థిక సంస్థలను బట్టి మారుతుంటుంది. ఒకే చెల్లింపులో గోల్డ్ లోన్ మొత్తం తీర్చేసే పద్ధతి కావడం వల్ల దీనికి బుల్లెట్ రీపేమెంట్ అనే పేరొచ్చింది. మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల కాల వ్యవధి కోసం బుల్లెట్ రీపేమెంట్ ప్లాన్‌ను కొన్ని బ్యాంకులు అందిస్తుంటాయి.
వడ్డీరేటుతో పాటు
బంగారంపై రుణాన్ని తీసుకునేటప్పుడు వడ్డీరేటు ఒకదాన్నే చూడొద్దు. వడ్డీరేట్లు, ఇతరత్రా ఛార్జీలను విధించే సమాచారాన్ని కూడా సేకరించాలి. మనం ఎంత కాలానికి బంగారాన్ని తనఖా పెడతాం ? అంతకాలంలో ఎంతమేర వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది ? అనే వివరాలపై అంచనాకు వచ్చేందుకు ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్లను వాడుకోండి.
వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల వివరాలు
ఇండియన్ బ్యాంకులో బంగారం రుణంపై వడ్డీరేటు 8.80 శాతం నుంచి 9 శాతం దాకా ఉంటుంది. మంజూరు చేసిన రుణంలో 0.56 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
- ఫెడరల్ బ్యాంకులో వడ్డీరేటు 8.99 శాతం మేర ఉంటుంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీరేటు 9.15 శాతం ఉంటుంది.
- కెనరా బ్యాంకులో పసిడి రుణంపై వడ్డీరేటు 9 శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుంచి రూ.5000 దాకా ఉంటుంది.
- ఎస్‌బీఐలో గోల్డ్ లోన్‌పై వడ్డీరేటు 9 శాతం దాకా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం, జీఎస్టీ కూడా చెల్లించాలి.
- యూనియన్ బ్యాంకులో వడ్డీరేటు 9.95 శాతం ఉంటుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీరేటు 12.25 శాతం ఉంటుంది. రుణం మొత్తంలో 0.75 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు.
- కరూర్ వైశ్యా బ్యాంకులో వడ్డీరేటు 10.65 శాతం ఉంది. రుణం మొత్తంలో 0.50 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా విధిస్తారు.
- ఐసీఐసీఐ బ్యాంకులో వడ్డీరేటు 9.25 శాతం నుంచి 18 శాతం దాకా ఉంటుంది. రుణం మొత్తంలో 2 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వడ్డీరేటు 9.30 శాతం నుంచి 17.86 శాతం దాకా ఉంటుంది. రుణం మొత్తంలో 1 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా విధిస్తారు.
- కోటక్ మహీంద్రా బ్యాంకులో గోల్డ్ లోన్‌పై వడ్డీరేటు ప్రతినెలా 0.88 శాతం ఉంటుంది. రుణం మొత్తంలో 2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా కట్టాలి.
- ఇండస్ ఇండ్ బ్యాంకులో బంగారం రుణంపై వడ్డీరేటు 10.35 శాతం నుంచి 17.05 శాతం దాకా ఉంటుంది. రుణం మొత్తంలో 1 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు.
- యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ లోన్‌పై వడ్డీరేటు 17 శాతం ఉంటుంది. రుణం మొత్తంలో 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు విధిస్తారు. జీఎస్టీ కూడా చెల్లించాలి.
- బంధన్ బ్యాంకులో వడ్డీరేటు 10.50 శాతం నుంచి 19.45 శాతం దాకా ఉంది. రుణం మొత్తంలో 1 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. జీఎస్టీ కట్టాలి.
- సిటీ యూనియన్ బ్యాంకులో గోల్డ్ లోన్‌పై వడ్డీరేటు 9.50 శాతం మేర ఉంటుంది.
- ముథూట్ ఫైనాన్స్‌లో వడ్డీరేటు అత్యధికంగా సంవత్సరానికి 22 శాతం దాకా ఉంటుంది. ప్రతినెలా 100 శాతం వడ్డీని చెల్లిస్తే 2 శాతం రిబేట్ ఇస్తారు.
బంగారు, వెండి ఆభరణాలను అమ్ముతున్నారా? మరి ఈ ట్యాక్స్ గురించి తెలుసా?
విదేశీ విద్య కోసం బ్యాంక్ లోన్ తీసుకోవాలా? బెస్ట్ రీపేమెంట్ ప్లాన్ ఇదే!