How to Erase Vastu Dosh from House : కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. అనుకున్న పనులు సకాలంలో జరగవు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరూ ఇలా సతమతమవుతుంటే అందుకు ఇంట్లోని వాస్తు దోషాలు కారణమయి ఉండవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వెలాడదీస్తే వాస్తు దోషాలన్ని తొలగించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
- ఏ ఇల్లు అయినా సరే త్రికోణాకారం, విసనకర్ర ఆకారం, U ఆకారంలో ఉండకూడదు. ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్.
- ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. అలా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఎక్కువగా ఉంటుందట.
- అలాగే, మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి. అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కేవిధంగా ఉండాలి. లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఎక్కేలా మెట్లు ఉండాలంటున్నారు. అదేవిధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట. వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడి కాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని చెబుతున్నారు.
- ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి. లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండవట.
- అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు, ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి. ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా, ఉత్తరం క్లోజ్ అయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే, కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలంటున్నారు.
- తూర్పు, పడమర, ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండడం మంచిదట. ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తు దోషాలుంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
- తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం మూటకట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి. ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చంటున్నారు.
- పడమర సింహద్వారం ఉంటే నీలం రంగు క్లాత్లో గుప్పెడు బియ్యం, అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు, కాస్త కర్పూరం వేసి మూటకట్టి దాన్ని శనివారం మార్నింగ్ ఆ పడమర సింహద్వారానికి కట్టాలి. ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట.
- ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకొని మూటకట్టాలి. దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు.
- అలాగే, సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవడం మంచిదట. కాబట్టి, ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను పొందవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే - అపార ధనలాభం కలుగుతుందట!
పూజ గదిలోని ఈ వస్తువులను కింద పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?