ISRO New Chairman : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది.
4 దశాబ్ధాలుగా సేవలు
వి.నారాయణన్ ఇస్రోలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఇస్రో ఛైర్మన్ పదవిలో రెండేళ్లపాటు ఉంటారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ)కు నేతృత్వం వహిస్తున్నారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలోనూ కీలకభూమిక పోషించారు. ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారు. నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తి చేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.