Four Special Trains For Sankranti 2025 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 9వ తేదీన కాకినాడ-వికారాబాద్ (07205), 10న వికారాబాద్-శ్రీకాకుళం రోడ్ (07207), 11న శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి (07208), 12న చర్లపల్లి-కాకినాడ టౌన్ (07206) రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జనరల్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్నిరకాల బోగీలు ఈ రైళ్లలో అందుబాటులో ఉన్నాయి.
సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా రైళ్లు : మరోవైపు సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి, రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
నాలుగు ప్రత్యేక రైళ్లు : సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణానికి మాత్రం ఖర్చు భారీగా అవుతుంది. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లో టికెచట్లు దొరకట్లేదు. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచేస్తున్నారు. సంక్రాంతికి ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలనే నేపథ్యంలో ప్రజలు సిద్ధమవడంతో ఇదే అదునుగా ఛార్జీలు భారీగా పెంచారు.
ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్ఠంగా రూ.7వేలకు పైగా టికెెట్ ఛార్జీలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు రూ.2,300, మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. పండుగకు ముందు మూడురోజులు జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
విమాన టికెట్లు : మరోవైపు విమాన టికెట్లు సైతం దాదాపు మూడింతలు పెరిగాయి. విమానాలలో ప్రయాణ సమయం తక్కువ కావడంతో పండుగకు ఊరెళ్లేవారు దీంట్లోనే వెళ్తున్నారు. జనవరి 11వ తేదిన హైదరాబాద్-విశాఖపట్నం టికెట్ ధరలు రూ.10,019 నుంచి రూ.13,000వరకు ఉన్నాయి. కానీ సాధారణ రోజుల్లో ఈ టికెట్ కేవలం రూ.3,900 మాత్రమే ఉంటాయి.
సంక్రాంతికి వెళ్లేవారికి ముఖ్య గమనిక - అందుబాటులోకి మరో 52 అదనపు రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్ టు విశాఖ టికెట్ @రూ.7 వేలు - సంక్రాంతికి వెళ్లడం ఈసారి అంత ఈజీ కాదు!