Bombay HC On Pregnant Issue : మానసికంగా పూర్తిస్థాయి పరిపక్వత లేని మహిళకు తల్లయ్యే హక్కులేదాఅని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేదని, పెళ్లి కాలేదని, అందుకే ఆమె 21 వారాల గర్భాన్ని తొలగించాలంటూ ఓ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ తన కుమార్తె మాత్రం ఆ గర్భాన్ని కొనసాగించాలని అనుకుంటుందని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఈ అభ్యర్థన రాగాఆ యువతి మానసిక ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ముంబయిలోని జేజే ఆసుపత్రి ఆ నివేదికను బుధవారం న్యాయస్థానం ముందు ఉంచింది. ఆ గర్భిణికి మానసిక అనారోగ్యం లేదని, పరిమితి స్థాయిలోనే మేధో వైకల్యం ఉందని వెల్లడించింది. ఆమె ఐక్యూ 75 శాతంగా ఉందని పేర్కొంది. ఆ గర్భాన్ని కొనసాగించడానికి యువతి పూర్తి ఆరోగ్యంతో ఉందని నివేదికలో వెల్లడించింది. అలాగే గర్భాన్ని తొలగించే విషయంలో సదరు యువతి సమ్మతి ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమని ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపించారు. ఈ వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"సాధారణం కంటే తక్కువ మేధస్సు ఉన్నంతమాత్రానా ఆమెకు తల్లయ్యే హక్కు ఉండదా? సగటు తెలివితేటలు ఉన్నవారికి తల్లిదండ్రులు అయ్యే హక్కు లేదని చెప్పడం చట్టవిరుద్ధం" అని వ్యాఖ్యానించింది. ఆమెకు తల్లిదండ్రులు ఎలాంటి మానసికపరమైన చికిత్స అందించలేదని, 2011 నుంచి ఔషధాలు మాత్రమే ఇస్తున్నారన్న అంశం కోర్టు దృష్టికి వెళ్లింది. ఇక గర్భానికి కారణమైన వ్యక్తి గురించి ఆ యువతి తల్లిదండ్రులకు ఇప్పటికే వెల్లడించింది. దీనిపై కోర్టు స్పందిస్తూ ‘"వారిద్దరు మేజర్లు. ఇదేమీ నేరం కాదు. తల్లిదండ్రులుగా చొరవ తీసుకొని, ఆ వ్యక్తితో మాట్లాడాలి" అని సూచించింది.