Delhi Assembly Election 2025 : 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఏకంగా 48 స్థానాల్లో విజయదుందుభి మోగించి, 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టేందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసారి ఏకంగా 40సీట్లు కోల్పోయి 22కే పరిమితమైంది. ఈ క్రమంలోనే గత ఎన్నికలతో పోలిస్తే, తాజా పోలింగ్‌లో పోటీలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఓట్ షేర్ ఎలా ఉందో చూద్దాం.
2020 ఎన్నికలతో పోలిస్తే, ఆప్ ఈసారి 10శాతం ఓట్ షేర్‌ను కోల్పోయింది. మరోవైపు మళ్లీ ఆధికారం దక్కించుకున్న బీజేపీ తమ ఓట్ షేర్‌ను 7శాతం పెంచుకుంది. ఇక ఒక్క సీట్ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్, తమ పార్టీ ఓట్ల వాటాను మాత్రం 2శాతం పెంచుకుంది.
ఏ పార్టీకి ఎంత శాతం
- ఆప్ : 2015 ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ 54.5 శాతం ఓట్లు సాధించింది. 70 సీట్లలో ఏకంగా 67 స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ వాటా 53.57 శాతంగా ఉంది. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల వాటాలో 10 శాతం కోల్పోయి 43.57 శాతానికి పడిపోయింది.
- బీజేపీ : భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 45.56 శాతం ఓట్లు సాధించింది. 2020లో దక్కించుకున్న 38.51శాతంతో పోలిస్తే, ఈసారి ఏడు శాతం మెరుగుపరుచుకుంది. కాగా, 2015లో కమలదళం ఓటు వాటా 38.51 శాతంగా ఉంది.
- కాంగ్రెస్ : దిల్లీలో వరుసగా 15 ఏళ్లు (1998-2013) అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ఎన్నికల్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేవలం 6.34 శాతం ఓట్లు మాత్రం దక్కించుకుంది. గత ఎన్నికల్లో సాధించిన 4.3 శాతంతో పోలిస్తే మాత్రం ఈసారి రెండు శాతం పెరగడం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశం.
ఆప్ రాజకీయాలకు ప్రజల కరెంట్ షాక్- దిల్లీ అభివృద్ధికి నాది గ్యారెంటీ: మోదీ
వరుసగా మూడోసారి కాంగ్రెస్ '0'- దిల్లీలో పతనానికి కారణాలేంటి? ఏం జరుగుతుంది?