Telangana High Court On Survey Department : తెలంగాణ రెవెన్యూ చట్టం, సర్వే, సరిహద్దుల చట్టం ప్రకారం సర్వే నిర్వహించి సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వే శాఖకు ఉందని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ చట్టాల కింద జారీ అయిన పలు సర్క్యులర్ల ప్రకారం నిర్దిష్ట గడువులోగా సర్వే పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. సర్వే నిర్వహించి భూమి హద్దులను గుర్తించడానికిగాను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన దరఖాస్తులపై నిర్దిష్ట గడువులోగా సర్వే నిర్వహించాల్సి ఉందని తెలిపింది. అవసరమైన ఫీజుతోపాటు పత్రాలను సమర్పించినట్లయితే సర్వేను పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.
నిర్దిష్ట గడువులోగా సర్వే నిర్వహించాలని ఆదేశం : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రెండు వేర్వేరు సర్వే నెంబర్లలోని 2.16 ఎకరాల భూమి, 1.24 సర్వే నిమిత్తం దరఖాస్తు చేసినా సర్వే నిర్వహించకపోవడంతో రమేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పొరుగున ఉన్న వ్యక్తితో తరచూ సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నందున సర్వే నిమిత్తం దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
దరఖాస్తు చేసిన 45 రోజుల్లోపు సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రైవేటు భూములకు సంబంధించి సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ పలు సందర్భాల్లో సర్క్యులర్లు జారీ చేశారన్నారు. ఈ సర్క్యులర్ల ప్రకారం పిటిషనర్ అన్ని పత్రాలను సమర్పించినట్లయితే నిర్దిష్ట గడువులోగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టండి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తున్నారని, అక్రమాలపై గత ఏడాది డిసెంబరు 9న వినతి పత్రం సమర్పించినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రుద్రంగికి చెందిన నరేశ్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి పి.సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రాందాస్ చౌహాన్ లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వానికి చెందిన భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారన్నారు. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతూ ఎలాంటి సర్వే నెంబరు పేర్కొనకుండా ఇంటి నెంబరు కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో షెడ్ల నిర్మాణం జరిగిందని, వాటిని తొలగించి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డివిజనల్ పంచాయతీ అధికారి దీనిపై విచారణ జరిపించి ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్ సమక్షంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీలో అక్రమాలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదు : హైకోర్టు
గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి - ఏం చేయకూడదో స్పష్టంగా చెప్పండి : హైకోర్టు