Tomato record Prices: మోత మోగిస్తున్న టమోటా.. కిలో రూ150! కొనేందుకు జంకుతున్న ప్రజలు
Problems With Tomato Prices: రైతులు పండించిన టమోటాకు గిట్టుబాటు ధరల్లేక.. పొలాల్లోనే వదిలేసిన, రోడ్లపై పారేసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ ఇప్పుడు ఆ టమోటా ధరలు ఆకాశాన్నంటడంతో.. మార్కెట్లో చూద్దామన్నా కన్పించటం లేదు. కిలో రూ.150లకు ఎగబాకిన టమోటాలను.. మధ్యతరగతి కుటుంబాలు కొనలేక అవస్థలు పడుతున్నాయి. దీంతోపాటు పర్చిమిర్చి ధరలు కూడా కిలో 110 రూపాయలకు చేరుకున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు ఈ స్థాయిలో ఉంటే పేద మధ్యతరగతి ప్రజానీకం కూరగాయలను ఎలా కొంటారు..?ఏం తింటారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమోటా ధరలు 150 రూపాయలు కావడంతో ప్రజలు కూరగాయలు కొనాలంటే గగ్గోలు పెడుతున్నారు. టమోటాలు లేకపోవడంతో రైతు బజార్లో కొన్ని స్టాల్స్‌ను పూర్తిగా మూసేశారు. ధరల పట్టిక బోర్డులో టమోటాలు అని రాశారు.. కానీ ధర మాత్రం రాయలేదు. ప్రభుత్వం సబ్సిడీతో టమోటోలు విక్రయిస్తున్నప్పటికీ ఒకరోజు వస్తే ఇంకొక రోజు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని రకాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, ఏవీ తినే పరిస్థితి కనిపించడం లేదని మహిళలు వాపోతున్నారు. మద్యాన్ని ఏరులుగా పొంగి పొర్లిస్తున్న ప్రభుత్వం.. కూరగాయల ధరలను అమాంతంగా పెంచడం దారుణమని ఖండించారు. తక్షణం కూరగాయల ధరలను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతున్నారు.