Tirumala Srivari Adhyayanostavam : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో డిసెంబర్ 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అధ్యయనోత్సవాలు అంటే ఏమిటి? ఈ ఉత్సవాలను ఎందుకు జరుపుతారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అధ్యయనోత్సవాలు అంటే?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ప్రాశస్త్యంపై ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేసే పవిత్రమైన ఉత్సవాలను అధ్యయనోత్సవాలు అంటారు.
ఎప్పుడు?
సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు మొదలై 24 రోజుల పాటు జరిగే ఈ అధ్యయనోత్సవాలు వచ్చే ఏడాది జనవరి 23వ తేదీతో ముగుస్తాయి.
అధ్యయనోత్సవాల్లో ఏమి చేస్తారు?
అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
అధ్యయనోత్సవాలలో ఇలా!
అధ్యయనోత్సవాలలో భాగంగా తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పరిసమాప్తి కార్యక్రమం జరుగుతాయి.
అధ్యయనోత్సవాల విశిష్టత
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అధ్యయనోత్సవాలు శ్రీవైష్ణవ సంప్రదాయంలో జరుగుతాయి. వైఖానస ఆగమ విధానంలో జరిగే ఈ కార్యక్రమానికి సాధారణ భక్తులను అనుమతించరు. స్వామివారి ప్రాశస్త్యాన్ని ధనుర్మాసంలో కీర్తించడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని విశ్వాసం. ఆ శ్రీనివాసుని అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ - ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.