Internet Problems In Bhadradri : డిజిటల్ యుగంలో సిగ్నల్స్ (మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ కనెక్టివిటీ) కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అయినా మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.
నెట్‌వర్క్ సదుపాయం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 99 గ్రామాల్లో నెట్‌వర్క్ సదుపాయం లేనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అధికంగా అశ్వారావుపేట మండలం పరిధిలో 15 గ్రామాలుండగా, అత్యల్పంగా చంద్రుగొండలో ఒక గ్రామానికి సిగ్నల్స్ లేవు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ ప్రజలకు సేవలన్నీ అంతర్జాలంలోనే అందుతున్నాయి. కొన్నిచోట్ల టవర్లు ఏర్పాటు చేసినా వాటి నుంచి కావాల్సిన సిగ్నల్స్ రావటం లేదు. సిగ్నల్స్‌లో హెచ్చుతగ్గుల కారణంగా వివిధ రకాల సేవల్లో జాప్యం జరుగుతుంది.
ఆర్థిక లావాదేవీలకు అవస్థలు : గ్రామాల్లో పింఛన్లు, రైతుబీమా, రైతు భరోసా తదితర పథకాలకు సంబంధించిన సొమ్మును బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించటంతో వాటిని పొందాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది. ఇలా జిల్లాలో డిజిటల్ సేవలు అందుబాటులోలేని 19 మారుమూల ప్రాంతాలను అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లోని వృద్ధులు, దివ్యాంగులు సైతం పింఛన్ల కోసం ప్రతినెలా సంబంధిత మండల కేంద్రానికి వెళ్తున్నారు. వినియోగదారుల సేవా కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకులు ముందుకొస్తున్నా సిగ్నల్స్ సమస్య వల్ల ఆగిపోతున్నాయి.
ఎదురవుతున్న సమస్యలివి :
- కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర సర్కారు సహకారంతో చేపట్టిన పంటల డిజిటల్ సర్వేకు జిల్లాలో సిగ్నల్ సమస్య ఆటంకంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో పంటల సర్వే చేయలేని పరిస్థితి ఉంది.
- గిరిజనులు, వ్యవసాయ కూలీలకు ప్రధాన జీవనాధారమైన ఉపాధి హామీ పథకానికి ఇంటర్నెట్ తప్పనిసరి కావటంతో కూలీలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- సిగ్నల్స్ సమస్య కారణంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో చేయాల్సి వస్తుంది.
- ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వస్తుంది.
- ఇల్లెందు మండలం పూబెల్లిలో గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేశారు. అయినా ఇంకా సేవలను ప్రారంభించలేదు. దీంతో స్థానికులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆళ్లపల్లి మండలం అడవిరామవరంలో : ఆళ్లపల్లి మండలం అడవిరామవరంలో ప్రజలు బ్యాంకు సేవలు పొందాలంటే సుమారు 10కి.మీ. దూరం వెళ్లాలి. దీంతో ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించిన బ్యాంకు అధికారులు వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సమస్యలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
"సిగ్నల్స్ సమస్య ఉన్న ప్రాంతాలను మొబైల్ టీంలు పరిశీలిస్తున్నాయి. కొన్నిచోట్ల టవర్ల ఏర్పాటుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వివిధ టవర్ల ద్వారా 4జీ సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం.అది అందుబాటులోకి వస్తే ఎక్కువ దూరం సేవలందుతాయి." -బానోత్ సక్రు, ఇల్లెందు సబ్‌డివిజన్ ఇంజినీర్, బీఎస్‌ఎన్‌ఎల్
'ఊత కర్ర' ఉంటేనే ఇందిరమ్మ ఇళ్ల సర్వే - ఆ ఊళ్లో అధికారులకు వింత అనుభవం
ఇందిరమ్మ ఇళ్ల 'సర్వే'త్రా.. సాంకే'తికమక' - సిగ్నల్, సర్వర్ సమస్యలతో సర్వేయర్లకు ఇక్కట్లు