Srisailam Akka Mahadevi Caves : అందాల నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున అక్కమహాదేవి గుహ ఉంది. ఇక్కడికి వెళ్లే దారిలో ప్రకృతి అందాలు చూడముచ్చటగా ఉంటాయి. అధ్యాత్మిక పర్యాటకుల గమ్యస్థానాల్లో ఒకటి ఈ గుహ. దీన్ని దర్శించాలనుకుంటే శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నుంచి 16 కిలో మీటర్ల దూరం కృష్ణా నదిలో పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి రోడ్డు మార్గంలో ఈ గుహకు, అక్కడి పర్యాటక ప్రదేశాలకు వెళ్లొచ్చు. దీనికోసం అటవీ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర అటవీశాఖ రోడ్డు నిర్మించింది.
దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభం : దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభం అవుతుంది. దట్టమైన నల్లమల అడవిలో వన్యప్రాణుల సందడి, పచ్చని చెట్ల అందాల మధ్య ఐదు కిలోమీటర్లు జీపులో ప్రయాణించాలి. ఆ తర్వాత ఓ అరకిలోమీటరు దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిలువెత్తు గిరుల మధ్యలో ఉండే అక్కమహాదేవి గుహ లోపలికి వెళ్లిరావచ్చు. రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచేందుకు అటవీశాఖ ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాలమడుగు, అక్కమహాదేవి గుహ ప్యాకేజీని అందుబాటులోకి తేనుంది. దీన్ని కొద్దిరోజుల్లోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇద్దరికి రూ.6,500-రూ.8,000 : అక్కమహాదేవి గుహ పర్యాటకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని రూపొందించనుంది. బస చేసేందుకు గది, టిఫిన్, భోజనం, రెండుసార్లు సఫారీ ఉంటాయి. ‘ఇద్దరికి కలిపి రూ.6,500, రూ.7,500, రూ.8,000 ఇలా మూడు రకాల టారిఫ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. గది విస్తీర్ణం, రివర్ వ్యూను బట్టి ఈ ధరలు కేటాయించబడతాయని అటవీ అధికారి ఒకరు తెలిపారు. దోమలపెంటలో హిల్‌టాప్ పక్కన ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌ను అటవీశాఖ కొత్త హంగులతో రూపొందించింది.
ప్రయాణం సాగుతుంది ఇలా : మధ్యాహ్నం 2 గంటలకు దోమలపెంట గెస్ట్‌హౌస్ నుంచి సఫారీ మొదలవుతుంది. ఆక్టోపస్ వ్యూపాయింట్, వజ్రాలమడుగుకు జీప్‌లో తీసుకెళ్లి చూపిస్తారు. రాత్రి గెస్ట్‌హౌస్‌లో బస, ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మరోసారి సఫారీ అక్కమహాదేవి గుహకు పయనం ఉంటుంది. దీనికి ముందు అల్పాహారంతో కూడిన టిఫిన్ బాక్స్ ఇస్తారు. దారి మధ్యలో చిరుత పులులు, అడవి కుక్కలు, కొండచిలువలు, ముళ్ల పందులు, జింకలు, రకరకాల పక్షుల్ని చూసే వీలుంటుంది. అక్కమహాదేవి దర్శనం అయ్యాక మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి గెస్ట్‌హౌస్‌కు తీసుకొస్తారు. ఓ టిఫిన్ బాక్స్, జ్యూట్ బ్యాగ్‌ని పర్యాటకులకు ఉచితంగా ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించుకుంది.
ఇవీ ప్రత్యేకతలు : అక్కమహాదేవి గుహ ముందు భారీ శిలాతోరణం ఉంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ శివలింగం ఉంది. 12వ శతాబ్దంలో కర్ణాటకు చెందిన అక్కమహాదేవి అనే శివ భక్తురాలు ఇక్కడ తపస్సు చేసి అనంతరం సమీపంలోని కదలీవనంలో శివైక్యం చెందారని ఇక్కడి కొంత మంది పెద్దలు చెబుతుంటారు. ఇక దోమలపెంట సమీపంలో ఉండే ఆక్టోపస్ పాయింట్ నుంచి వీక్షిస్తే కృష్ణా నది ఆక్టోపస్‌లా కనిపిస్తుంది. దోమలపెంట సమీపంలోనే ఉండే వజ్రాలమడుగులో ఒకప్పుడు వజ్రాలు లభించేవని ప్రతీతి.
రాష్ట్రంలో మరో టూరిస్ట్ స్పాట్ - స్పీడ్ బోట్లతో రయ్ రయ్ మంటూ సరికొత్త జల పర్యాటకం