Morning Rituals for Good Luck : చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవగానే అర చేతులు చూసుకుని దైవాన్ని స్మరించుకోవడం అలవాటుగా ఉంటుంది. మరికొంతమంది నిద్రలేచిన తర్వాత నేలను తాకి నమస్కరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సానుకూల దృక్పథం అలవడుతుందని, అలాగే రోజంతా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు. అయితే.. రాత్రి నిద్రపోయే ముందు, అలాగే పొద్దున నిద్ర లేవగానే కొన్ని నియమాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది.. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు కాలంతో పరుగులు తీస్తున్నారు. ఆఫీసు, వ్యాపార కార్యకలాపాల్లో ఒత్తిడితో రాత్రి వచ్చే సరికి ఎంతో అలసిపోతున్నారు. దీంతో రాత్రి మంచి నిద్రకు దూరమైపోతున్నారు. అయితే, ఇలాంటి వారు నిద్రించేటప్పుడు శివనామస్మరణ చేయడం వల్ల త్వరగా నిద్రపడుతుందని వేణుగోపాల్ చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే నిద్ర నుంచి మెలకువ రాగానే విష్ణు నామాన్ని జపించాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
నిద్ర లేచిన తర్వాత:
ఉదయాన్నే నిద్రలేచి విష్ణు నామాన్ని జపించిన తర్వాత వీలైతే ఇలా చేయండి. మీ కాలి బొటన వేళ్లపైన నిలబడి.. రెండు చేతులను ఆకాశం వైపు చూపిస్తూ ఉంచండి. ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేయాలి. ఇలా చేస్తే సర్వాంతర్యామి అయిన అద్వితీయమైనటువంటి దివ్యశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుంది. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ దైవానుగ్రహం మీ వెంట ఉంటుందని వేణుగోపాల్ చెబుతున్నారు.
ఇష్ట దైవన్ని స్మరించుకోండి :
నిద్రలేవగానే కళ్లు నలుపుకుంటూ మీ అర చేతులు మీరే చూసుకోండి. మన అరచేతులు చూసిన అనంతరం.. దేవుడి చిత్రపటాన్ని చూడండి. ఇందుకోసం ఎల్లప్పుడూ మీ ఇష్ట దైవమైన.. చిన్న చిత్రపటాన్ని నిద్రించే చోట ఉంచుకోండి.
ఆవు నెయ్యితో :
రాత్రి నిద్రించే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి తీసి పక్కన పెట్టుకుని పడుకోండి. పొద్దున నిద్రలేవగానే చేతితో.. అద్దానికి కాస్త నెయ్యితో బొట్టు పెట్టండి. అనంతరం అద్దంలో మీ ముఖం చూసుకోండి. ఇలా అద్దానికి.. నెయ్యితో బొట్టు పెట్టి మన ముఖం చూసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వేణుగోపాల్ అంటున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"ఈ పరిహారం చేస్తే - మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది!"
మీ లక్కీ నెంబర్ ప్రకారం.. మీ ఇల్లు ఈ ఫేసింగ్ లో ఉంటే మంచిదట!