Sweet Cravings Depression Diabetes: కొంతమంది స్వీట్స్, కేక్స్ వంటి పదార్థాలను చూస్తే చాలు.. తినకుండా ఉండలేరు. ఒక్కటే కదా.. తింటే ఏమవుతుంది అని కడుపులో వేసేస్తుంటారు. దీనివల్ల బరువు పెరుగుతామని తెలిసినా కొందరు అలవాటు నియంత్రించుకోలేక పోతుంటారు! అయితే, ఇలా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల.. డిప్రెషన్, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు, పండుగలు సమయంలో, పుట్టిన రోజు వేడుకల్లో.. ఇలా ఏదోక సందర్భాల్లో స్వీట్లు, కేకులు తప్పకుండా తినాల్సి వస్తుంది. కానీ, కొందరు ఏ సందర్భం లేకపోయినా తరచూ స్వీట్లు లాగిస్తుంటారు. దీనివల్ల మధుమేహం, డిప్రెషన్, స్ట్రోక్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని ఇంగ్లాండ్‌కు చెందిన University of Surrey పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్రిటన్‌లోని 1,80,000 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్‌లో (Journal of Translational Medicine) ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పరిశోధనలో భాగంగా వారి ఆహారపు అలవాట్లను బట్టి మూడు వర్గాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో ఉండేవారు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. కానీ, తీపి పదార్థాలు తక్కువగా తీసుకుంటారు. రెండవ గ్రూప్‌లో ఉండేవారు మాంసం, చేపలు, తీపి పదార్థాలు అన్నీ తింటారు. మూడవ గ్రూప్‌లో ఉండేవారు మాత్రం కేకులు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకుంటారు.
"మన ఆహారపు అలవాట్లపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. స్వీట్లు, కేకులు, కూల్ డ్రింక్స్ వంటివి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని అధికంగా తీసుకునే వారిలో మిగతా రెండు గ్రూపులతో పోల్చితే.. డిప్రెషన్ వచ్చే అవకాశం 31 శాతం ఎక్కువగా ఉంది. అలాగే మధుమేహ ప్రమాదం కూడా పొంచి ఉండవచ్చు." -డాక్టర్ నోఫర్ గీఫ్మాన్ (Nophar Geifman) (హెల్త్ అండ్ బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్-University of Surrey)
దూరంగా ఉంటేనే మంచిది!
తీపి పదార్థాలు ప్రాసెస్ షుగర్‌తో తయారు చేస్తారు. ప్రాసెస్ చేసిన షుగర్‌లో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెరను తిన్న వెంటనే బ్లడ్‌లో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల బాడీలో ఇన్సులిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. ఇలా తరచూ జరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు డయాబెటిస్ అంచున ఉన్నారని డౌటా? - ఇలా పిడికిలితో తెలుసుకోవచ్చట!