TGSRTC MD Sajjanar Fire On Social Media Influencers : సామాజిక మాధ్యమాల్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలుకుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకొని, డబ్బులకు కక్కుర్తిపడి విదేశీ బెట్టింగ్, ఆన్‌లైన్ పందేలు తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధమున్నా అవేవీ పట్టనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచార మోజులో పడి గ్యాంబ్లింగ్‌కు అలవాటై వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటు : విదేశీ ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ంగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే హెచ్చరిక చేసింది. మీ ఇన్ప్లూయెన్స్తో అమాయకుల జీవితాలు బలి చేయవద్దని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని వివరించారు. గుర్తు పెట్టుకోండి మీరంతా శిక్షార్హులు అని తెలియజేశారు.
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 30, 2025
యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చ… pic.twitter.com/WSuRzwWNeQ
మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేం ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటే. సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ఆపండి. స్వార్థానికి పోయి అమాయకుల ప్రాణాలకు బాధ్యులు కాకండి. - వీసీ సజ్జనార్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ
చట్ట ప్రకారం చర్యలు : ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన యువత చేసిన అప్పులు తీర్చలేక వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటి కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటుంటే కొందర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. గ్యాబ్లింగ్‌ను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. కొన్ని నెలలుగా గేమింగ్ యాప్‌లపై సోషల్ మీడియాలో ప్రచార వీడియోలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా వీడియోల్ని తమ దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.