భారత్ Vs ఇంగ్లాండ్: పుణెలోనే ముగించేస్తారా? సిరీస్ సొంతం చేసుకుంటారా? - IND VS ENG 4TH T20 PREVIEW
భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20- ఇప్పటికే సిరీస్‌లో 2-1తో అధిక్యంలో ఉన్న భారత్- గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్న భారత్


Published : Jan 30, 2025, 8:42 PM IST
IND Vs ENG 4th T20 Preview : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్, భారత్‌ల మధ్య పుణె వేదికగా నాలుగో టీ20 జరగనుంది. ఇప్పటికే 2-1తో అధిక్యంలో ఉన్న భారత్ నాలుగో టీ20లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడో మ్యాచ్‌లో అనుహ్యంగా ఓటమి చవిచూడడంత ఈసారి గెలుపే లక్ష్యంగా భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పుణె పిచ్ స్పిన్‌కు అనుకూలం కావటంతో ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వారు ప్రభావం చూపనున్నారు.
ఉత్కంఠ పోరుకు వేదిక
బ్యాటర్లకు కూడా పిచ్ బాగానే సహకరిస్తుందని నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు అంతర్జాతీయ టీ20లు జరగ్గా అందులో భారత్ రెండింటిలో గెలిచి మరో రెండింటిలో ఓడింది. గత రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెుదట బ్యాటింగ్ చేసిన జట్లు 200లకు పైగా స్కోర్ చేశాయి. పుణె మరోసారి ఉత్కంఠ పోరుకు వేదిక కానుందని ఉందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
సూర్యకుమార్‌పై మరోసారి ఒత్తిడి
మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో అనుహ్యఓటమి చవిచూసిన భారత్ ఈ మ్యాచ్‌లో రెండుమార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న పేసర్ అర్షదీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అర్షదీప్‌ను తీసుకునే అవకాశం ఉంది. అటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను పక్కనపెట్టి శివందూబే తుది జట్టులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్‌పై మరోసారి ఒత్తిడి నెలకొంది.
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో రాణించి విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఓపెనర్ సంజూశాంసన్ కూడా ఈ సిరీస్‌లో తనస్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్‌పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రాణిస్తున్నాబ్యాటింగ్‌లో విఫలమవుతుండటం జట్టును కలవరపెడుతోంది. మూడో టీ-20 మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మరోసారి జట్టు భారీఆశలు పెట్టకుంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన షమీ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది.
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాన బ్యాటర్లు బెన్ డకెట్, లివింగ్‌స్టన్‌లు ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్‌ల వైఫల్యం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బౌలర్లు మరోసారి కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.