Maratha Reservation Agitation : ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయానికి నిప్పు.. మరాఠా కోటా నిరసనలు ఉద్ధృతం - మహారాష్ట్ర బీడ్ జిల్లాలో మరాఠీల నిరసనలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 30, 2023, 7:37 PM IST
Maratha Reservation Agitation : మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు నిరసనకారులు. తొలుత బీడ్ మజల్‌గావ్‌లోని శాసనసభ్యుడు ప్రకాశ్ సోలంకే నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. ఇళ్లు, కార్లకు నిప్పంటించారు. ఆ తర్వాత మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీర్సాగర్ ఇంటికి, కార్యాలయానికి నిప్పంటించారు.
మున్సిపల్ భవనానికి నిప్పు
దీంతో పాటు మజల్‌గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనానికి నిప్పంటించారు. అంతకుముందు ఉదయం వేలాది మంది మరాఠా నిరసనకారులు మున్సిపల్ కార్యాలయం వద్ద గుమిగూడారు. రిజర్వేషన్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ భవనంలోకి దూసుకెళ్లారు. అనంతరం కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.
ఆడియో క్లిప్‌తో మరింత తీవ్రం
ఇటీవలే ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలపై, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్రకాశ్ సోలంకే ఇంటిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఘటన సమయంలో తాను, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నామని.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన వివరించారు.