ఆవు పేడను విసురుకుంటూ పండగ- చొక్కాలు విప్పి ఒకరిపై ఒకరు! - ఆవు పేడతో పండగ వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Nov 16, 2023, 5:47 PM IST
Cow Dung Throwing Festival : తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని తలవాడి కుమితపురం గ్రామస్థులు ఓ వింత ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పరస్పరం పేడను విసురుకునే ఈ పండగను చనియది ఉత్సవంగా పిలుస్తారు. గ్రామంలోని 300 ఏళ్ల నాటి భీరేశ్వరాలయంలో ఈ పండగను ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. దీపావళి తర్వాత వచ్చే మూడో రోజున ఈ పండగను జరుపుకుంటారు.
అయితే ఈ ఉత్సవంలో పురుషులు మాత్రమే పాల్గొంటారు. చొక్కాలు విప్పి ఒకరిపై ఒకరు ఆవు పేడతో చేసిన గుండ్రటి ముద్దలను విసురుకుంటారు. ఇందుకోసం గ్రామస్థులంతా ఉత్సవానికి కొద్ది రోజుల ముందే ఆవు పేడను ఒక చోట సేకరిస్తారు. అలా జమ చేసిన పేడను ట్రాక్టర్ సాయంతో భీరేశ్వరాలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గాడిదలపై స్వామివారి వేషధారణలో ఉండే వ్యక్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ తర్వాత గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.
ఆరోగ్యం కోసమేనట!
అయితే ఇలా పేడను శరీరంపై విసురుకోవడం ద్వారా వ్యాధులు సోకవని.. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం బాగా పండుతుందని.. పాడిపశువులు కూడా వన్యప్రాణుల బారిన పడకుండా ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు.