కాలం కలిసి వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు అనేది సామెత. కానీ ఇప్పుడు.. బాగా నడుస్తూ ఉంటే, డబ్బులు ఇచ్చే కాలం వచ్చేసింది. ఆశ్చర్యంగా ఉందా? మీరు విన్నది నిజమే.
నడిస్తే చాలు.. డబ్బులు!
అమెరికాలోని ఓ జిమ్ కంపెనీ నడిస్తే చాలు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. యూటాలోని సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఓ జిమ్ కంపెనీ.. 'చీఫ్ స్టెప్ ఆఫీసర్' పోస్టు కోసం ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా రోజుకు 10 వేల అడుగులు నడిస్తే చాలు, అక్షరాలా 10,000 డాలర్లు (సుమారుగా రూ.8.2 లక్షలు) వేతనంగా ఇస్తామని వెల్లడించింది. దీనితో యువత ఈ ఉద్యోగం కోసం క్యూలు కడుతున్నారు.
ఏం చేయాలి?
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ప్రతి రోజూ నడవాలి. కసరత్తులు చేయాలి. వారం చివరిలో తాము ఈ ఏడు రోజుల పాటు చేసిన వ్యాయామాలు, ఎదుర్కొన్న సమస్యలు, సమస్యలను అధిగమించిన విధానం.. ఇలా అన్ని విషయాల పట్ల ఓవరాల్ ఫీలింగ్ గురించి తెలియజేస్తూ ఓ వ్యాసం రాయాలి. ఇతరులను సైతం వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తూ.. నెల రోజులపాటు ప్రతి రోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి.
చాలా బహుమతులు గెలుచుకోవచ్చు!
ఒక నెల రోజులపాటు విజయవంతంగా ఈ పని పూర్తి చేస్తే, మీకు ఒక మంచి స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇస్తారు. దీనితో మీరు ప్రతి రోజూ ఎన్ని అడుగుల నడుస్తున్నారో ట్రాక్ చేసుకోవచ్చు. దీనితోపాటు నెలకు 2000 డాలర్లు ఇస్తారు. ఈ విధంగా 5 నెలలపాటు విజయవంతంగా ఈ పనిచేస్తే.. మొత్తంగా 10,000 డాలర్లు మీ సొంతం అవుతాయి. దీనితో పాటు చీఫ్ స్టెప్ ఆఫీసర్ ఉద్యోగం కూడా మీకు లభిస్తుంది.
తీరా సెలెక్ట్ కాకపోతే..
ఐదు నెలలపాటు కష్టపడి రోజుకు 10,000 అడుగుల చొప్పున నడిచి కూడా సెలెక్ట్ కాకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారా? అది కూడా మీకు మంచినే చేస్తుంది. నడిస్తే ఏం పోతుంది.. మహా అయితే సన్నబడతారు. ఇంకా అయితే ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా తయారవుతారు. అంతే కదా!
బరువు తగ్గి నాజూకుగా తయారవుతారు!
Walking for Weight Loss : ప్రతి రోజూ 10,000 అడుగులు చొప్పున వారం రోజులు నడిస్తే.. మీ శరీరంలోంచి 3,500 కాలరీలు కరుగుతాయని అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెబుతోంది. వాస్తవానికి మీరు రోజుకు ఒక గంట పాటు నడిస్తే.. 100 నుంచి 175 కాలరీలు కరుగుతాయి. ముఖ్యంగా వేగంగా, ఎక్కువ దూరం నడిచినా; ఎత్తైన ప్రదేశాల్లో నడిచినా మీలోని కాలరీలు కరిగే రేటు పెరుగుతుంది. ఇవన్నీ మిమ్మల్ని బరువు తగ్గించి, నాజూకుగా మారుస్తాయి.
కండలు పెరుగుతాయి!
Walking for muscular strength : వాస్తవానికి బాగా నడిస్తే మీ కండరాల శక్తి, సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. అందువల్ల ఇప్పటి నుంచి అయినా రోజుకు ఒక గంటపాటు నడవడం మొదలుపెట్టండి. వాస్తవానికి నడక అనేది ఒక కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ మాత్రమే. అందువల్ల మంచి కండలు తిరిగిన దేహం కావాలంటే నడకతోపాటు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
హృదయ స్పందనలు, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి
Walking Immunity and Heart rate : రోజుకు ఒక అరగంట చొప్పున వారానికి ఐదు రోజులపాటు నడిస్తే.. హృదయ సంబంధిత సమస్యలు 19 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా మీ రోగనిరోధక శక్తి కూడా బాగా వృద్ధి చెందుతుంది.
చూశారుగా! ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే నడక ప్రారంభించండి. ఒక వేళ మీరు గ్రౌండ్‌కు వెళ్లి నడవడానికి ఇబ్బందిగా ఉంటే.. కనీసం ఇంటిలోనైనా అటూ ఇటూ కొద్ది సేపు తిరగండి. ఇది మీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే.. మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
కొసమెరుపు : రోజుకు 10 వేల అడుగులు నడిచి, 10,000 డాలర్లు (రూ.8.2 లక్షలు) జీతంతో ఉద్యోగం సంపాదించాలంటే.. కచ్చితంగా మీకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. మరీ ముఖ్యంగా అమెరికన్ పౌరుడు అయ్యుండాలి.