మోదీకి సపోర్ట్‌గా అమెరికాలో 200కార్లతో భారీ ర్యాలీ- మళ్లీ ఆయనే ప్రధాని కావాలంటూ! - Car Rally For BJP In America - CAR RALLY FOR BJP IN AMERICA
🎬 Watch Now: Feature Video
Published : Apr 1, 2024, 12:17 PM IST
|Updated : Apr 1, 2024, 12:25 PM IST
Huge Car Rally For BJP In America : అమెరికాలోని పలు నగరాల్లో బీజేపీ మద్దతుదారులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 200కుపైగా కార్లు, 300కుపైగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేరీల్యాండ్, అట్లాంటా సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 20కుపైగా నగరాల్లో ఈ ర్యాలీని చేపట్టారు నిర్వాహకులు. అట్లాంటా జార్జీయా సిటీలో ఏకంగా 150కిపైగా కార్లు ర్యాలీలో పాల్గొన్నాయి. భారత్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కిపైగా మెజార్టీని కట్టబెట్లాలని మద్దతుదారులు కార్ల ర్యాలీలో భారతీయ ఓటర్లను కోరారు.
ర్యాలీలో పాల్గొన్న కార్ల అద్దాలపై బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. అక్కడక్కడా అయోధ్య రామమందిరం జెండాతో పాటు త్రివర్ణ పతాకం కూడా దర్శనమిచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ కాషాయం రంగులో ఉన్న టోపీలు, కండువాలు, టీషర్టులను ధరించి కనిపించారు. టీషర్టులపై 'మే హూ మోదీకా పరివార్', 'యూఎస్ఏ ఫర్ మోదీ 2024' లాంటి నినాదాలు రాసి ఉన్నాయి. అంతేకాకుండా కొందరు తమ వాహనాల టాప్, బానెట్లపై 'అబ్కీ బార్ 400 పార్', 'తీస్రీ బార్ మోదీ సర్కార్' అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ర్యాలీలో కార్లతో పాటు ఓ పెద్ద ట్రక్కు కూడా పాల్గొంది.
మరోవైపు ఈ ర్యాలీలో ఓ మహిళా ఆరెంజ్ కలర్ కాగితంపై మోదీతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఉన్న ఫొటోను పట్టుకొని కనిపించారు. ఇక గతంలో ఆస్ట్రేలియాలోనూ 'ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' పేరుతో ఇదే తరహా ర్యాలీని నిర్వహించారు మద్దతుదారులు.