తండ్రి చివరి కోరిక- ICUలోనే ఇద్దరు కూతుళ్ల పెళ్లి- వైద్యుల సమక్షంలోనే! - Marriage In ICU - MARRIAGE IN ICU
Published : Jun 16, 2024, 10:33 AM IST
Marriage In ICU At Lucknow : ఫాదర్స్ డే వేళ ఓ తండ్రి కోరిక తీర్చేందుకు ఇద్దరు కూతుళ్లు ఐసీయూలోనే తమ వివాహం చేసుకున్నారు. డాక్టర్ల అనుమతితో ఆ తండ్రి కోరికను తీర్చారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
లఖ్‌నవూకు చెందిన సయ్యద్ మహ్మద్ జునైద్ ఇక్బాల్ కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరాడు. అప్పటికే తన ఇద్దరు కూతుళ్ల వివాహాలను నిశ్చయించాడు. అయితే తన కూతుళ్ల పెళ్లి చేయడానికి వెళ్లాలని డాక్టర్లను కోరాడు. కానీ, గత రెండు రోజుల నుంచి ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో పెళ్లికి వెళ్లేందుకు వైద్యులు అనుమతి ఇవ్వలేదు. చివరి కోరికగా తన కూతుళ్ల వివాహం చూడాలని డాక్టర్లను ప్రాధేయపడ్డాడు. దీంతో ఆస్పత్రిలోనే పెళ్లి చేసేందుకు అంగీకరించారు వైద్యులు. ఐసీయూలోకి వరుడు, ఇద్దరు కుటుంబసభ్యులను, పెళ్లి జరిపించే మౌలాను మాత్రమే అనుమతిచ్చారు. ఆస్పత్రి సిబ్బంది సమక్షంలోనే ఇక్బాల్ ఎదుట ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇద్దరు కూతుళ్లకు వివాహం వేడుకను నిర్వహించారు. తన కూతుళ్ల పెళ్లి చూసిన జునైద్ ఇక్బాల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.