పొగమంచులోనే జవాన్ పెళ్లి బరాత్- 10 కి.మీలు డ్యాన్స్ చేస్తూ ఊరేగింపు
Published : Feb 5, 2024, 9:54 AM IST
Marriage Ceremony In Snowfall : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఓ అరుదైన వివాహ ఊరేగింపు జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచులోనే ఊరేగింపును కొనసాగించారు బంధువులు. అలా ఏకంగా 10 కిలోమీటర్లు కాలినడకన సాగిన ఈ ఊరేగింపు చివరకు వధువు ఇంటికి చేరింది.
వరుడు నవీన్ చౌహాన్ ఉత్తరకాశీ నివాసి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి నమ్రత చౌహాన్ అనే యువతితో వివాహం నిశ్చయమయింది. గత బుధవారం బంధువుల సమక్షంలో వీరిద్దరు ఏడడుగులతో ఒక్కటయ్యారు. అయితే రోడ్డు మార్గం ద్వారా వధువు ఇంటికి చేరుకోవాల్సి ఉంది వరుడి బృందం. ఈ క్రమంలో మంచు కురుస్తుండడం వల్ల ఆ రోడ్డును మూసివేశారు అధికారులు. ఈ సమయంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో చేసేదేమి లేక మంచులోనే మోరీ బ్లాక్‌లోని హడ్వాడి గ్రామం నుంచి వరుడి ఊరేగింపు ప్రారంభమైంది. సంప్రదాయ పహారీ దుస్తులు ధరించిన వరుడి స్నేహితులు, బంధువులు అంతా కలిసి పాటలకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.