Upcoming Smartphones in March 2025:మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ మార్చి 2025లో కిర్రాక్ స్మార్ట్ఫోన్లు లాంఛ్‌కు రెడీగా ఉన్నాయి. వాస్తవానికి మొబైల్ ప్రపంచంలో ఒక పెద్ద ఈవెంట్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' పేరుతో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో చాలా కంపెనీలు తమ ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తాయి. ఇక ఈ మార్చి నెలలో రియల్‌మీ, నథింగ్, వివో, షావోమీ, శాంసంగ్, ఐకూ, హానర్ వంటి కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లను భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలో లాంఛ్ చేయనున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ కంపెనీల నుంచి లాంఛ్‌కు రెడీగా ఉన్న స్మార్ట్ఫోన్ల వివరాలు తెలుసుకుందాం రండి.
1. Nothing Phone 3a:ఈ జాబితాలో 'నథింగ్ ఫోన్ 3a' కూడా ఉంది. UK- బేస్డ్ కంపెనీ నథింగ్ కొన్ని వారాల క్రితం ఈ ఫోన్‌ను త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మార్చి 4న లాంఛ్ అవుతుంది. ఇక ఈ ఫోన్ గురించి లీక్ అయిన అన్ని నివేదికల ప్రకారం ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్‌తో 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనితో 12GB RAM సపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ ఫోన్ వెనక భాగంలో 50-50MP మూడు కెమెరాలు ఇవ్వొచ్చు. దీనిలో మెయిన్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ కూడా ఉండొచ్చు.
2. Nothing Phone 3a Pro: నథింగ్ మార్చి 4న ఈ ఫోన్‌ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్, 12GB RAM, 256GB స్టోరేజీ, 50MP రియర్ కెమెరా సెటప్‌తో పాటు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు. ఈ ఫోన్ వెనక భాగంలో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుందని అంతా భావిస్తున్నారు. వీటితో పాటు కంపెనీ ఈ ఫోన్‌లో అనేక AI ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.
3. Vivo T4x 5G:వివో కూడా ఈ మార్చిలో తన 'T4x 5G' ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో కంపెనీ 6.68 అంగుళాల ఫుల్ HD ప్లస్ స్క్రీన్‌ను అందించొచ్చు. దీని రిఫ్రెష్ రేటు 120Hz కావచ్చు. ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 8GB RAM, 6500mAh బ్యాటరీ ఇవ్వొచ్చు. దీనితో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వొచ్చు. ఈ సెగ్మెంట్లో అతిపెద్ద బ్యాటరీతో ఈ అప్‌కమింగ్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది.
4. Xiaomi 15:ఈ జాబితాలో షావోమీ నుంచి కూడా ఒక స్మార్ట్‌ఫోన్ ఉంది. షావోమీ తన తదుపరి ప్రీమియం ఫోన్‌ను కూడా మార్చి 2025లో లాంఛ్ చేయొచ్చు. దీన్ని 'షావోమీ 15' పేరుతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ భారతదేశంలో 'షావోమీ 14'ను కూడా గతేడాది మార్చి నెలలోనే విడుదల చేసింది.
ఇక ఈ ఫోన్‌లో 6.36-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 24GB వరకు RAM (భారతదేశంలో 16GB RAM వరకు), వెనక భాగంలో 50MP + 50MP + 50MP కెమెరా సెటప్, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఇది కాకుండా దీనికి 5400mAh బ్యాటరీ ఇవ్వొచ్చు. ఇది 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చని తెలుస్తోంది.
5. Realme 14 Pro Lite: 'రియల్‌మీ 14' సిరీస్‌లో మూడు ఫోన్‌లు లాంఛ్ అయ్యాయి. వాటిలో 'రియల్‌మీ 14x', 'రియల్‌మీ 14 ప్రో', 'రియల్‌మే 14 ప్రో+' మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్‌మీ 14 ప్రో లైట్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.