Neuralink Brain Chip :మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తొలిసారిగా ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సోమవారం తెలిపారు. ఆ వ్యక్తి ప్రస్తుత వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రారంభ ఫలితాల్లో స్పష్టంగా 'న్యూరాన్ స్పైక్ డిటెక్షన్'ను గుర్తించినట్లు పేర్కొన్నారు.
Neuralink Elon Musk :కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసేందుకు నిర్వహించే 'బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్‌ఫేస్' (బీసీఐ) ప్రయోగాలు అమెరికాలో జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు అమెరికా 'ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)' గతేడాది మేలో ఆమోదం తెలిపింది. ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా న్యూరాలింక్ చిప్‌ను అమర్చి పరీక్షించారు. ఈ చిప్ అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని తేలిందని న్యూరాలింక్ సంస్థ నిపుణులు చెబుతున్నారు. దీని సాయంతో ఒక కోతి 'పాంగ్' వీడియో గేమ్‌ను ఆడిందని చెప్పారు.
ఎలా పనిచేస్తుందంటే?
బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) ప్రాజెక్టులో భాగంగా న్యూరాలింక్ 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను తయారు చేసింది. ఆ చిప్‌నకు సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం కేవలం 20వ వంతు ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి ఆ ప్రదేశంలో ఎన్1 సాధనాన్ని అమర్చుతారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో 3 వేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెడతారు. అవి ఎటుపడితే అటు వంగేలా, సుతిమెత్తగా ఉంటాయి. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను ఎలక్ట్రోడ్లు గుర్తించి చిప్‌నకు పంపిస్తాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తికి 10 చిప్‌లను అమర్చవచ్చు. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది.