Ancestry DNA Test : మన తండ్రి, తాత చరిత్ర మనకేమీ కొత్తగా అనిపించదు. ఎందుకంటే, ఆ చరిత్రలో మనం కూడా ఉంటాం కాబట్టి. చాలా విషయాలు మనకు తెలిసే జరుగుతాయి కాబట్టి. మన ఇంట్లోని పెద్దవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు మనకు చెబుతారు కాబట్టి. కానీ, మీ ముత్తాత గురించి మీకు తక్కువ విషయాలు తెలుస్తాయి. వాళ్ల తండ్రులు, తాతల గురించి తెలిసే అవకాశం చాలా చాలా తక్కువ. ఇక వారి ముందు తరాల చరిత్ర తెలిసే ఛాన్సే లేదు.
అంటే, రఫ్‌గా నాలుగైదు తరాల గురించిన సమాచారం తప్ప, అంతకు ముందు పూర్వీకుల గురించి మనకు తెలియదు. కానీ, ఒకే ఒక పరీక్ష చేయిస్తే మన పుట్టుపూర్వోత్తరాల వివరాలన్నీ బయటపడతాయి. మన DNA ఏ ప్రాంతానికి చెందినదో తెలిసిపోతుంది. మన పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో తేలిపోతుంది. ఇవాళ మనం ఇండియాలో ఉన్నా, మన పాత తరాలు ఏ ప్రాంతంలో, ఏ దేశంలో నివసించారో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ వివరాలు తెలుసుకోవడం భలే ఆసక్తిగా ఉంటుంది కదూ! అది తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మీ జుట్టు కర్లీగా, లేదంటే సాఫ్ట్‌గా ఉంటుంది ఎందుకిలా? మీరు చాలా ఎత్తుగా ఉండొచ్చు, లేదంటే పొట్టిగా ఉండొచ్చు కారణమేంటి? మీ చెంపల మీద డింపుల్ (సొట్ట) ఉండొచ్చు అది ఎలా వచ్చింది? ఇంతే కాదు, మీలో ఉన్న రోగాలు, మీ స్ట్రెంథ్, మీ రంగు, మీ బిహేవియర్ ఇలా మీ గురించిన ఎన్నో రకాల సందేహాలను నివృత్తి చేయడానికి ఒకే ఒక్క పరీక్ష అందుబాటులో ఉంది. అదే DNA Ancestry Test.
మన దేశంతోపాటు వివిధ దేశాల్లోని పలు సంస్థలు ఇలాంటి టెస్టు చేస్తున్నాయి. ఈ టెస్టు ద్వారా గత 500 ఏళ్లలో మీ పూర్వీకుల వివరాలు తెలుసుకోవచ్చు. మరింత లోతుగా కావాలంటే వెయ్యి సంవత్సరాలు దాటి కూడా పోవచ్చు. మీ పూర్వీకుల వివరాలు మాత్రమే కాదు, మీ మూలవాసులు ఎవరో కూడా తెలుసుకోవచ్చు. వారు ఎక్కడ మొదలై, ఎటువెళ్లి, ఇప్పుడున్న మీరున్న చోటికి వచ్చారు? వంటి వివరాలు కూడా తెలుస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ శరీరంలో నియాండర్తల్ DNA పర్సంటేజ్ ఎంత ఉంది? అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మొత్తంగా 70 రకాలకు పైగా రిపోర్టులు ఈ పరీక్ష ద్వారా అందుకోవచ్చు. National Geographic వాళ్లు Gene 2.o పేరుతో ఈ టెస్టు కొంత కాలం కింద వరకూ నిర్వహించారు. పలు వేరే సంస్థలు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి. మీరు కూడా మీ మూలవాసుల గురించి, పూర్వీకుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ టెస్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
మనదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ తనది ఇండియా DNA అని చెప్పారు. ఈ మధ్య నిర్వహించిన టెస్టుల్లో అది తేలిందని అన్నారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.